ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పాకిస్తాన్, ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్‌ను రావల్పిండి నుండి లాహోర్‌కు తరలించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష వర్గాలు అవిశ్వాస తీర్మానానికి దాఖలు చేసిన తర్వాత రాజకీయ గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
దేశంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ, ప్రతిపక్షం పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) లు మద్దతుగా పెద్ద ఎత్తున జనాలను తీసుకురావడంతో వేదికల మార్పుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. పార్టీలు ప్లాన్ చేస్తున్న అనేక రోడ్‌షోల కారణంగా భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్ జరిగే ప్రాంతాన్ని మార్చాలని అధికారులు నిర్ణయించుకున్నారు.
అసలు షెడ్యూల్ ప్రకారం, పాకిస్తాన్- ఆస్ట్రేలియా మార్చి 29, 31, ఏప్రిల్ 2 తేదీల్లో మూడు వన్డేలు (ODIలు) మరియు ఏప్రిల్ 5 న ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) ఆడాల్సి ఉంది. అవన్నీ రావల్పిండిలో జరగాల్సి ఉండగా.. ఇప్పుడు లాహోర్ కు తరలించారు.