ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా హర్యానాలోని తన స్వగ్రామమైన సమల్ఖాకు మొట్టమొదటి సారి చేరుకున్నాడు. స్వగ్రామంలో నీరజ్ చోప్రాకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రం నలుమూలల నుండి అభిమానులు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు నీరజ్ స్వగ్రామానికి వచ్చారు. ఉదయం నుంచి కారు టాప్‌పై నిలుచుని.. గోల్డ్ మెడల్ ను ప్రజలకు చూపిస్తూ ఊరిగేంపులో పాల్గొన్నాడు. అభిమానులు నీరజ్‌పై పూల వర్షం కురిపించారు.
అయితే.. మూడు రోజుల క్రితమే తీవ్ర జ్వరంతో బాధపడిన నీరజ్.. ఆరు గంటల పాటు ఊరేగింపులో పాల్గొనడంతో బాగా నీరసించిపోయాడు. దీంతో నీరజ్ ఇంటికి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నీరజ్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అతన్ని ఆస్పత్రికి తరలించారు. నీరజ్ చోప్రాను పరిశీలించిన డాక్టర్లు.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. కొంత విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు నీరజ్ స్నేహితులు తెలిపారు. ఇదిలావుంటే.. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నీరజ్ చోప్రాకు నెగిటివ్ అని తేలింది.