ఫ్యాక్టరీల్లో రాత్రింబవళ్లు పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు శుభవార్త. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల వరకు మహిళా కార్మికులను బలవంతంగా పని చేయించకూడదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. "ఉదయం 6 గంటలలోపు మరియు సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా కార్మికురాలు తన వ్రాతపూర్వక అనుమతి లేకుండా పని చేయకూడదు. ఆ సమయాల్లో పని చేస్తే ఉచిత రవాణా, ఆహారం మరియు తగిన పర్యవేక్షణను అందించాలి" అని ప్రభుత్వ సర్క్యులర్ పేర్కొంది. ఆర్డర్ ప్రకారం.. ఒక మహిళా కార్మికురాలు సాయంత్రం 7 నుండి ఉదయం 6 గంటల మధ్య పని చేయడానికి ఇష్టపడకపోతే, ఆమె ఉద్యోగం నుండి తొలగించబడదు.
సాయంత్రం 7 నుండి ఉదయం 6 గంటల మధ్య పని చేసే మహిళలకు ఆహారం మరియు తగిన పర్యవేక్షణ అందించబడుతుంది. మరుగుదొడ్లు, డ్రింకింగ్ సదుపాయాలు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రం 7 నుండి ఉదయం 6 గంటల మధ్య, కనీసం నలుగురు మహిళలు కలిసి ఒకే ఆవరణలో పని చేయాలి. లైంగిక వేధింపుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. "కార్యాలయంలో లైంగిక వేధింపుల సంఘటనను నివారించడానికి మహిళా కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించే బాధ్యత యజమాన్యంపై ఉంటుంది", అని ఉత్తర్వుల్లో ఉంది.