బాంబు పేల్చిన విధ్వంసకర క్రికెటర్.. 29 ఏళ్లకే అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
By Medi Samrat
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోజుల వ్యవదిలోనే పూరన్ రిటైర్మెంట్ నిర్ణయం వెలువడింది. పురాన్, హెన్రిక్ ఇద్దరూ T20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు. ఇప్పుడు వీరిద్దరూ రిటైర్మెంట్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
పురాన్ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కొనసాగించనున్నాడు. 29 ఏళ్ల నికోలస్ పూరన్ క్రికెట్ మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం ఆలస్యంగా అంటే జూన్ 9వ తేదీన ఆయన ఈ షాకింగ్ ప్రకటన చేశారు. "చాలా ఆలోచించి, ఎన్నో చర్చల తరువాత, నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను" అని పూరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు.
నేను ఇష్టపడే ఈ గేమ్ చాలా ఇచ్చింది.. ఇస్తూనే ఉంది. ఆనందం, మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం.. ఆ మెరూన్ జెర్సీ ధరించి, జాతీయ గీతం కోసం నిలబడి, మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అన్నీ ఇచ్చింది.. ఇది మాటల్లో చెప్పడం కష్టం. టీమ్‌కి కెప్టెన్‌గా ఉండటాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదించానని పేర్కొన్నాడు.
పూరన్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. "ఆ అభిమానులకు - మీ అచంచలమైన ప్రేమకు ధన్యవాదాలు. మీరు కష్ట సమయాల్లో నాకు మద్దతుగా ఉన్నారు. మంచి క్షణాలను గొప్ప అభిరుచితో జరుపుకున్నారు. నా కుటుంబం, స్నేహితులు, సహచరులకు, నాతో అతుక్కుపోయినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీ విశ్వాసం, మద్దతు నన్ను అన్నిటినీ అధిగమించేలా చేసిందని పేర్కొన్నాడు.
నికోలస్ పూరన్ టీ20లో మొత్తం 106 మ్యాచ్‌లు, వన్డేల్లో 61 మ్యాచ్‌లు ఆడాడు. అతను 61 ODI మ్యాచ్‌లలో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సహాయంతో 1,983 పరుగులు చేశాడు. 106 టీ20 మ్యాచ్‌లు ఆడి 97 ఇన్నింగ్స్‌ల్లో 13 అర్ధ సెంచరీల సాయంతో 2,275 పరుగులు చేశాడు.
IPL 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన నికోలస్ పూరన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 14 మ్యాచ్‌లు ఆడి 524 పరుగులు చేశాడు, అందులో అతను 5 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ఓవరాల్‌గా 90 మ్యాచ్‌లు ఆడిన అతను 2,293 పరుగులు చేశాడు.