పెను సంచలనం.. నెదర్లాండ్స్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌కు భారత్
Netherlands stun South Africa by 13 runs at T20 World Cup.నెదర్లాండ్స్ జట్టు చేతిలో దక్షిణాఫ్రికా ఓడి పోయింది.
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2022 4:26 AM GMTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో మరో పెను సంచలనం నమోదు అయ్యింది. పసికూన నెదర్లాండ్స్ జట్టు చేతిలో దక్షిణాఫ్రికా 13 పరుగుల తేడాతో ఓడి పోయింది. దీంతో టోర్నీ నుంచి దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించింది. ఫలితంగా జింబాబ్వే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎంబర్గ్ (37), మ్యాక్స్ డౌడ్(29) తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించి శుభారంభం అందించగా.. టామ్ కూపర్ (35), అకెర్‌మాన్(41 నాటౌట్), ఎడ్వర్డ్స్ (12 నాటౌట్) రాణించడంతో నెదర్లాండ్స్ మంచి స్కోర్ చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా, అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్‌క్రమ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 25 పరుగులతో రిలీ రూసో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో డికాక్(13), బావూమా(20), మార్‌క్రమ్(17), డేవిడ్ మిల్లర్ (17), క్లాసెన్ (21), వేన్ పార్నెల్ (0), కేశవ్ మహరాజ్ (13), కగిసో రబడ(9 నాటౌట్), అన్రిచ్ నోర్జె (4 నాటౌట్)లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ మూడు వికెట్లు తీయగా, ఫ్రెడ్ క్లాసెన్, బాస్ డె లీడే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పౌల్ వాన్ మీకెరన్ ఓ వికెట్ తీశాడు.
సెమీస్ చేరిన భారత్..
గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే జట్లపై దాదాపుగా ఉత్కంఠ వీడింది. సఫారీల ఓటమితో భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. ఇక రెండో సెమీస్ బెర్త్ కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు పోటీ పడునున్నాయి. ఈ రెండు జట్లు చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. వీరిద్దరి మధ్య జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీస్ చేరనుంది.
𝐈𝐧𝐭𝐨 𝐓𝐡𝐞 𝐒𝐞𝐦𝐢𝐬 🙌#TeamIndia | #T20WorldCup pic.twitter.com/4avLw1VgOT
— BCCI (@BCCI) November 6, 2022