అమెరికా వేదికగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. వీసా నిరాకరణ‌తో చెదిరిన ఓ స్టార్‌ ఆట‌గాడి క‌ల‌..!

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు ప్రాక్టీసును కూడా ప్రారంభించాయి. ఈసారి ఈ టోర్నీని అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్నాయి.

By Medi Samrat  Published on  31 May 2024 6:14 PM IST
అమెరికా వేదికగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. వీసా నిరాకరణ‌తో చెదిరిన ఓ స్టార్‌ ఆట‌గాడి క‌ల‌..!

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు ప్రాక్టీసును కూడా ప్రారంభించాయి. ఈసారి ఈ టోర్నీని అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్నాయి. అయితే అమెరికా ప్ర‌పంచ‌క‌ప్‌కు వేదిక అవ‌డం కారణంగా.. టీ20 ప్రపంచకప్ ఆడాలనే ఓ ఆటగాడి కల చెదిరిపోయింది. ఈ ఆటగాడు నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానే.

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ప్రపంచకప్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచ కప్‌లో నేపాల్ జట్టు కూడా పాల్గొంటుంది. ఈ జట్టులో సందీప్ లామిచానే ముఖ్యమైన ఆట‌గాడు. కానీ అతడు ఈ ప్రపంచకప్‌లో ఆడడం సాధ్య‌ప‌డ‌దు. ఎందుకంటే.. సందీప్‌కు వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించడమే ఇందుకు కారణం. సందీప్ వీసా రెండోసారి కూడా తిరస్కరణకు గురైంది.

నేపాల్ ప్రభుత్వం, నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సందీప్‌కు మద్దతు ఇచ్చింది. అయితే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. సందీప్‌కి అమెరికా వీసా ఇవ్వలేదు. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. "నేపాల్ ప్రభుత్వం, నేపాల్ క్రికెట్ బోర్డు, క్రీడా మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. సందీప్‌కు వీసా మంజూరు చేయడానికి అమెరికా నిరాకరించిందని తెలిపారు. అంతేకాదు.. కొన్ని విషయాలు రహస్యంగా ఉంచబడినందున వీసాకు సంబంధించిన కేసుపై ఏమీ చెప్పలేమని యుఎస్ ఎంబసీ తెలిపింది.

సందీప్ త‌న‌పై అత్యాచారం చేశాడని ఓ బాలిక ఆరోపించింది. ఆ అమ్మాయి మైనర్ కావడంతో సందీప్‌కి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ కేసులో సందీప్‌కు జిల్లా కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత జ‌ట్టు యాజ‌మాన్యం అతడిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో సందీప్ హైకోర్టును ఆశ్రయించడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు.

అయితే.. ఇప్పుడు కూడా సందీప్‌కు అమెరికా వీసా తిరస్కరించడంతో నేపాల్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఇందుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

Next Story