కేకేఆర్ సూప‌ర్ విక్ట‌రీ.. ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్‌.!

ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశలకు దాదాపు తెరపడింది

By Medi Samrat  Published on  4 May 2024 6:44 AM IST
కేకేఆర్ సూప‌ర్ విక్ట‌రీ.. ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్‌.!

ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశలకు దాదాపు తెరపడింది. ఈ విజ‌యంతో కేకేఆర్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే దిశగా కొన‌సాగుతుంది. -0.356 నెట్ రన్ రేట్‌తో ముంబై తొమ్మిదో స్థానంలో ఉంది.

170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌య‌లుదేరిన‌ ముంబైకి శుభారంభం లభించలేదు. పవర్‌ప్లేలో ఎంఐ 46 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔట్ కాగా.. నమన్ ధీర్, రోహిత్ శర్మ చెరో 11 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. డేవిడ్ త‌ర్వాత ఎవ‌రూ క్రీజులో నిల‌వ‌క‌పోవడంతో ముంబై జట్టు 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది.

మిచెల్ స్టార్క్ 19వ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. స్టార్క్.. టిమ్ డేవిడ్, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీలను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ లు తలో రెండు వికెట్లు తీశారు.

ముంబై ఇండియన్స్‌పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సాల్ట్-నరైన్ వంటి బ్యాట్స్‌మెన్ ముంబై బౌలింగ్ ముందు పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో సాల్ట్ ఐదు పరుగులు, రఘువంశీ 13 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ ఆరు పరుగులు, సునీల్ నరైన్ ఎనిమిది పరుగులు, రింకూ సింగ్ తొమ్మిది పరుగులు చేశారు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ ఆరో వికెట్‌కు 62 బంతుల్లో 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పాండేను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. పాండే 42 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు విధ్వంసం సృష్టించారు. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. అలాగే వాంఖడే స్టేడియంలో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. నువాన్ తుషార మూడు వికెట్లు, కెప్టెన్ పాండ్యా రెండు, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీశారు. కోల్‌కతా జట్టు 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది.

Next Story