హార్దిక్ పాండ్యాపై నిషేధం ముప్పు.. వ‌చ్చే ఐపీఎల్ ఆడుతాడా..?

హార్దిక్ పాండ్యా IPL-2024లో ముంబై ఇండియన్స్ త‌రుపున ఆడ‌నున్నాడు. అయితే హార్దిక్ ముంబైలో చేర‌డంపై హార్ధిక్‌తో పాటు

By Medi Samrat  Published on  6 Dec 2023 9:15 PM IST
హార్దిక్ పాండ్యాపై నిషేధం ముప్పు.. వ‌చ్చే ఐపీఎల్ ఆడుతాడా..?

హార్దిక్ పాండ్యా IPL-2024లో ముంబై ఇండియన్స్ త‌రుపున ఆడ‌నున్నాడు. అయితే హార్దిక్ ముంబైలో చేర‌డంపై హార్ధిక్‌తో పాటు ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఇద్దరూ నియమాల‌ను ఉల్లంఘించార‌ని అంద‌రూ అంటున్నారు. దీనికి సంబంధించి 2010లో రవీంద్ర జడేజాను ఐపీఎల్-2010 నుంచి నిషేధించిన ఘటనను కూడా ఉదహరిస్తున్నారు. ఇప్పుడు హార్దిక్ ను కూడా బ్యాన్ చేస్తారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ సీఈవో అరవిందర్ సింగ్ స్పందించారు.

హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన తీరు సరికాదని గుజరాత్ టైటాన్స్ సీఈవో స్పష్టంగా చెప్పారు. ఐపీఎల్ ట్రేడ్ కోసం ఆటగాళ్లను నేరుగా సంప్రదించడం తప్పు. ఇందుకోసం బీసీసీఐ విధానాన్ని జట్లు అనుసరించాలి. కానీ ఈ పద్ధతి (హార్దిక్ ట్రేడ్) సరికాకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తితో ఉంది. ఐపీఎల్ ట్రేడింగ్‌కు సంబంధించి బీసీసీఐ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.

2010 సంవత్సరంలో రవీంద్ర జడేజా IPL ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. ట్రేడింగ్ ప్రక్రియలో అతడు ముంబై ఇండియన్స్‌తో చర్చలు ప్రారంభించాడు. అయితే అతని కాంట్రాక్టును పొడిగించడం ద్వారా రాజస్థాన్ అతనిని కొనసాగించింది. అయితే జడేజా ముందుకు సాగాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. దీంతో అప్పటి ఐపీఎల్ మేనేజ్‌మెంట్ కమిటీ జడేజాపై చర్య తీసుకుని ఏడాది పాటు నిషేధం విధించింది.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే జరిగింది. గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ లిస్టులో హార్దిక్ పేరు ఉంది కానీ కొన్ని గంటల్లోనే అతడు ముంబై ఇండియన్స్‌లో చేరాడు. హార్దిక్‌పై నిషేధం విధించడంపై సోషల్ మీడియాలో కొందరు స్పందించారు. KKR మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రస్తుతం దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ లేదా ఏ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఐపీఎల్‌లో హార్దిక్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

Next Story