వేలంలో ఆ ముగ్గురిపైనే 'ముంబై ఇండియన్స్' గురి..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) తదుపరి సీజన్ కోసం మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 10:15 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) తదుపరి సీజన్ కోసం మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది. ఇటీవల అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ 5 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను జట్టులో ఉంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కోసం ముంబై ఇండియన్స్ అత్యధికంగా రూ.18 కోట్లు ఖర్చు చేసింది.
ఇప్పుడు వేలంలో జట్టుకు వికెట్ కీపర్, ఫాస్ట్ బౌలర్, మరో ఓపెనర్‌తో పాటు స్పిన్నర్లు అవసరం. MIకి రైట్ టు మ్యాచ్ కార్డ్ కూడా అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో ఫ్రాంచైజీ ఈ కార్డును ఇషాన్ కిషన్‌పై ఉపయోగించే అవకాశం ఉంది.
రిషబ్ పంత్
మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌తో పాటు, చాలా ఫ్రాంచైజీలు రిషబ్ పంత్‌పై దృష్టి పెట్టాయి. వికెట్ కీపర్ కోసం అయితే పంత్ మంచి ఎంపిక. అంతే కాకుండా మిడిల్ ఆర్డర్‌లో కూడా అతడు బ్యాటింగ్ చేయగలడు. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. అటువంటి పరిస్థితిలో ముంబై పంత్‌ను వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్ 3284 పరుగులు చేశాడు.
అర్షదీప్ సింగ్
ముంబై ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను అట్టిపెట్టుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేయడం చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి మరో ఫాస్ట్ బౌలర్ అవసరం. అటువంటి పరిస్థితిలో అర్ష్‌దీప్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్ తమ శాయశక్తులా ప్రయత్నించవచ్చు. అంతర్జాతీయ టీ20లోనూ సింగ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 65 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సింగ్ 76 వికెట్లు తీశాడు.
యుజ్వేంద్ర చాహల్
హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ముంబై ఇండియన్స్‌కు మంచి స్పిన్నర్ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో జెడ్డాలో జరిగే వేలంలో ముంబై ఇండియన్స్ చాహల్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చాహల్ నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తన పేరిటే ఉన్నాయి. అతను 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు తీశాడు. లీగ్ చరిత్రలో మరే బౌలర్ కూడా 200 వికెట్లు తీయలేదు