టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త వ్యాపారాన్నిమొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు 'కడక్‌నాథ్' పెంపకంపై దృష్టి సారించినట్లు సమాచారం. రాంచీలోని ధోనీ ఫాంహౌజ్ లో ఈ ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ధోనీ ముందుగానే 2 వేల కోడి పిల్లలు ఆర్డర్ చేసినట్లు .. అవి కూడా డిసెంబరు 15వ తేదీ నాటికి డెలివరీ కానున్నయట. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట.
ఈ విషయమై మధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోనీ తమను సంప్రదించాడని.. అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝూబువా, అలీరాజ్‌పూర్ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్లలో ప్రొటీన్ల శాతం ఎక్కువ కాగా.. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. ఇక ఈ జాతి కోడి కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుందట.. దీని గుడ్డు ధర రూ.40–50 పైగానే పలుకుతుందట.