మరో టైటిల్ వేట.. ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్
MS Dhoni and Co beat Gujarat by 15 runs, into the final. మరో టైటిల్ వేట.. ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్
By Medi Samrat Published on 24 May 2023 2:38 AM GMTమహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్ 2, మహీశ్ తీక్షణ 2, రవీంద్ర జడేజా 2, మతీష పతిరణ 2, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు. ఆఖర్లో రషీద్ ఖాన్ చెన్నై ను కాస్త టెన్షన్ పెట్టాడు. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 42 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (4), తెవాటియా (3) విఫలమయ్యారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇది పదోసారి. ఈ నెల 28న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేతతో తలపడనుంది. ఓడిన గుజరాత్ టైటాన్స్ కు మరో చాన్స్ ఉంది. ఆ జట్టు మే 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ చెన్నై భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. గైక్వాడ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా, కాన్వే 34 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 87 పరుగులు చేశారు. శివమ్ దూబే (1), రహానే 17, రాయుడు 17, జడేజా 22 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, మోహిత్ శర్మ 2, దర్శన్ నల్కండే 1, రషీద్ ఖాన్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.