కోచ్ గంభీర్‌ను జ‌ట్టులో ఎవరూ సీరియస్‌గా తీసుకోరు : మాజీ స్పిన్నర్ సంచ‌ల‌న కామెంట్స్‌

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

By Medi Samrat  Published on  13 Jan 2025 9:14 PM IST
కోచ్ గంభీర్‌ను జ‌ట్టులో ఎవరూ సీరియస్‌గా తీసుకోరు : మాజీ స్పిన్నర్ సంచ‌ల‌న కామెంట్స్‌

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టును 1-3తో ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారూలు గెలుచుకున్నారు. దీని తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్, అనుభవజ్ఞుడైన ఆటగాడు విరాట్ కోహ్లీపై భ‌విష్య‌త్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ గంభీర్ కోచింగ్ తీరుపై మాట్లాడాడు. కోచ్‌ గౌతం గంభీర్‌ను జట్టు స‌భ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోరని అన్నాడు.

ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారత జట్టు పేలవ ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో ఆట‌గాడిగా గంభీర్ రికార్డు బాగా లేదని, అందుకే జట్టులో ఎవరూ అతన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పాడు. పనేసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. గంభీర్ ఇప్పుడే కోచ్‌గా మారాడు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు కొన్నిసార్లు ఇది కష్టంగా ఉంటుంది, 'సరే, నేను కొన్నేళ్ల క్రితం అతని సహచరుడిని, ఇప్పుడు అతను క్రికెట్ ఎలా ఆడాలో మాకు చెబుతున్నాడు. ఈ పరివర్తన కష్టం కావచ్చు. అతని రికార్డు (బ్యాట్స్‌మన్‌గా) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో అంత బాగా లేదని అన్నాడు.

ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్‌ను భారత టెస్టు జట్టుకు కోచ్‌గా చేయవచ్చని, గంభీర్‌కు పరిమిత ఓవర్ల బాధ్యతను ఇవ్వవచ్చని పనేసర్ బీసీసీఐకి సూచించారు. పనేసర్ ఇంకా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో అతని (గంభీర్) సగటు 23. ఇంగ్లండ్‌లో కూడా అతని సగటు బాగా లేదు. అతను కదిలే బంతిని బాగా ఆడలేదు. కోచ్‌గా గంభీర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాడా.. లేక వన్డేలు, టీ20లపైనే అతడిని దృష్టి పెట్టమ‌ని.. వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వారిని తీసుకురావాల‌ని సెలక్టర్లు ఆలోచిస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో గంభీర్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. వీటిలో 22.62 సగటుతో 181 పరుగులు చేశాడు. అదే సమయంలో ఇంగ్లండ్ పై ఆడిన ఐదు టెస్టు మ్యాచ్‌లలో అతను 12.70 సగటుతో 127 పరుగులు చేశాడు.

గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఐదు సిరీస్‌లలో రెండింట్లో విజయం సాధించగా.. మూడింటిలో ఓటమి చవిచూసింది. మొత్తం 16 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా ఆరింటిలో విజయం సాధించగా, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ 16 మ్యాచ్‌ల్లో 10 టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. 10 టెస్టుల్లో భారత్ మూడు గెలిచి ఆరింటిలో ఓడిపోగా, ఒక టెస్టు డ్రా అయింది. గంభీర్ పర్యవేక్షణలో టీమ్ ఇండియా మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా, వన్డేల్లో మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయి ఒక మ్యాచ్ టై అయింది.

Next Story