430 రోజుల తర్వాత కూడా ఫ‌లించ‌ని 'షమీ' నిరీక్షణ..!

అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరికొంత కాలం వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

By Medi Samrat  Published on  22 Jan 2025 7:46 PM IST
430 రోజుల తర్వాత కూడా ఫ‌లించ‌ని షమీ నిరీక్షణ..!

అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరికొంత కాలం వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. భారత్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య‌ ఈరోజు టీ20 సిరీస్‌ ప్రారంభమవ‌గా.. మొదటి మ్యాచ్‌లో షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించలేదు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. గాయం కారణంగా అతను ఏడాదికి పైగా అంటే దాదాపు 430 రోజులు జట్టుకు దూరంగా ఉన్నాడు. షమీ చివరిసారిగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఫైనల్‌ ఆడాడు.

టాస్ సమయంలో సూర్య వికెట్ కాస్త ట‌ఫ్‌గా ఉంటుంద‌ని ఉందని.. మంచు కూడా రాబోతోందని.. అందుకే తాను తర్వాత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో కఠినమైన, ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది.. జట్టును ఎంపిక చేయడం చాలా కష్టమైంది.. మహ్మద్ షమీ, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ నేటి మ్యాచ్ ఆడడం లేదని పేర్కొన్నాడు.

మొదటి T20Iలో టీమిండియా అర్ష్‌దీప్ సింగ్ తో మాత్రమే ఆడుతుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి.. అర్ష్‌దీప్ సింగ్‌కు తోడుగా బౌలింగ్ చేయ‌నున్నారు. సూర్యకుమార్ స్పిన్నర్లకే ప్రాధాన్య‌త ఇచ్చాడు. సంజూ శాంసన్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ బౌలింగ్ చేయగలరు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌తో పాటు వరుణ్ చక్రవర్తి కూడా తమ స్పిన్ మ్యాజిక్‌ను చూపించనున్నారు. ఓపెనింగ్ బాధ్యత అభిషేక్ శర్మ, సంజు భుజాలపై ఉంది.

Next Story