22 ఏళ్ల షమీ బౌలింగ్ చేస్తున్న‌ట్లు ఉంది : అర్ష్‌దీప్

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మ‌రికొంత‌కాలం వేచి ఉండాల్సిన ప‌రిస్థితి వచ్చింది.

By Medi Samrat  Published on  23 Jan 2025 10:03 AM IST
22 ఏళ్ల షమీ బౌలింగ్ చేస్తున్న‌ట్లు ఉంది : అర్ష్‌దీప్

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మ‌రికొంత‌కాలం వేచి ఉండాల్సిన ప‌రిస్థితి వచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతనికి ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు షమీ ఎంపిక కాకపోవడంతో అతడు ఫిట్‌గా లేడనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చాడు.

షమీ ఫిట్‌గా ఉన్నాడ‌ని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ హామీ ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ 33 ఏళ్ల షమీని ప్రశంసించాడు. యువ బౌలర్‌లా బౌలింగ్‌ చేస్తున్నాడన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో షమీ లేడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. త‌ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు.

ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ జియో సినిమాతో మ్యాచ్ పోస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నిన్న నేను షమీ భాయ్‌తో ఇదే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయ‌న‌ బౌలింగ్ చేస్తున్నప్పుడు.. ఆయ‌న‌ చేతి నుండి బంతి బయటకు వచ్చే విధానం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రతి డెలివరీని చూసి మీనుంచి 'వావ్!' అనే మాట బయటకు వస్తుంది. ఇంకొన్ని రోజులు వేచి ఉండండి.. మీరు ఆయ‌న‌ బౌలింగ్‌ని చూసి ఆనందిస్తారు. షమీ చేతిలో నుంచి బంతి వస్తున్న తీరు చూస్తుంటే 22 ఏళ్ల షమీ భాయ్‌ బౌలింగ్‌ తిరిగి వచ్చినట్లు కనిపిస్తోందన్నాడు.

అంతకుముందు.. మహ్మద్ షమీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో ప్లేయింగ్-11లోకి ఎంపిక కాలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. షమీ గురించి సూర్య మాట్లాడుతూ.. షమీ తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు.

అయితే.. ప్రాక్టీస్ స‌మ‌యంలో షమీ కాలికి బ్యాండేజీతో కనిపించడంతో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. భారత్ తరఫున 2023 వన్డే ప్రపంచకప్‌లో షమీ తన చివరి మ్యాచ్‌ని ఆడాడు.

Next Story