భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న మూడో వన్డే వర్షార్పణం అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ 1- 0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా.. మిగిలిన రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్ లో న్యూజిలాండ్ కి గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ (49), లోవర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ (51) మినహా ఏ బ్యాటర్ కూడా న్యూజిలాండ్ బౌలర్లకు ఎదురు నిల్వలేకపోయారు.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి 2, మిల్నే3,డేరీ మిచెల్3, లాకీ ఫెర్గుసన్, సాంథర్ లకు ఒక్కో వికెట్ పడ్డాయి. 220 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది. ఇంకో రెండు ఓవర్లు జరిగినా డక్ వర్త్ లూయిస్ ప్రకారం కివీస్ కు విజయం దక్కేదే..! కానీ వర్షం ఆగకపోవడంతో మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు అంపర్లు ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టామ్ లాథమ్ ను వరించింది. టీ20 సిరీస్ ను కూడా వర్షం అడ్డుకున్న సంగతి తెలిసిందే..! మూడు టీ20ల సిరీస్ ను 1-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.