2022లో ఘోరమైన కారు ప్రమాదం తర్వాత టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రక్షించడంలో సహాయం చేసిన వ్యక్తి రజత్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన రజత్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలితో కలిసి విషం తాగాడు. వారి కుటుంబాలు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో, ఈ సంబంధాన్ని తిరస్కరించారు. ఇంట్లో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో అతని ప్రియురాలితో కలిసి విషం సేవించాడు.
రజత్ (25) ప్రస్తుతం రూర్కీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా.. అతని 21 ఏళ్ల ప్రియురాలు మన్ను బుధవారం చికిత్స పొందుతూ మరణించింది. ఈ జంట ఉత్తరాఖండ్ నగరానికి అతి సమీపంలో ఉన్న బుచ్చా గ్రామానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 9న ఆ మహిళ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించినట్లు సమాచారం. దీంతో ఆ నిర్ణయం తీసుకుంది.
ఇరు కుటుంబాల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు రానప్పటికీ పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. ముజఫర్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ సత్యన్నారాయణ ప్రజాపత్ మాట్లాడుతూ, దర్యాప్తులో బయటపడే సాక్ష్యాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.