సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ను చిత్తుచేసిన లక్నో సూపర్ జెయింట్స్
Lucknow Super Giants won by 7 wkts Against Sunrisers Hyderabad. ఐపీఎల్ 2023లో 58వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది.
By Medi Samrat Published on 13 May 2023 7:15 PM IST
ఐపీఎల్ 2023లో 58వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సన్‌రైజర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మలు హైదరాబాద్ తరుపున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లుగా బరిలో దిగారు. మూడో ఓవర్ తొలి బంతికి 7 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. ఆరో ఓవర్ నాలుగో బంతికి రాహుల్ త్రిపాఠి కూడా ఔట్ అయ్యాడు. త్రిపాఠి 13 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
9వ ఓవర్లో అమిత్ మిశ్రా బౌలింగ్ లో అన్మోల్‌ప్రీత్ సింగ్ కూడా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అన్మోల్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 13వ ఓవర్‌లో కృనాల్ పాండ్యా వేసిన తొలి బంతికే ఐడెన్ మార్క్రామ్ స్టంపౌట్ అయ్యాడు. మార్క్రామ్ 20 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అదే ఓవర్ రెండో బంతికి గ్లెన్ ఫిలిప్స్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగలిగింది.
ఛేదనకు వచ్చిన లక్నో ఇన్నింగ్సును మందకోడిగా ప్రారంబించింది. నాలుగో ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ కు రాగా.. రెండో బంతికి కైల్ మేయర్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మేయర్స్ 14 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 9వ ఓవర్ మయాంక్ మార్కండే వేయగా.. రెండో బంతికి క్వింటన్ డికాక్ క్యాచ్ ఔట్ అయ్యాడు. డికాక్ 29 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత ప్రేరక్ మన్కడ్ 64 పరుగులు.. నికోలస్ పూరన్ 44 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు రాణించడంతో లక్నో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది.