లెజెండ్స్ లీగ్ క్రికెట్.. రెండో ఎడిషన్ షెడ్యూల్ విడుదల
Legends League Cricket Announces Schedule For the 2022 Season.లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2022 9:00 AM GMTఅంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ ఆటగాళ్ల కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‌సీ) టోర్నమెంట్ ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా రెండో సీజన్‌కు సిద్దమైంది. టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్‌లో పోటీ పడనున్నారు. ఈ టోర్నికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టోర్నీ నిర్వాహకులు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఆరు నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, న్యూఢిల్లీ, కటక్, లక్నో, జోధ్‌పూర్ వేదికగా జరగనుండగా... ప్లేఆఫ్ వేదికలు ఇంకా ఖారారు కాలేదు. కాగా ఈ టోర్నీ ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇండియా మహారాజ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రెస్టాఫ్ వరల్డ్ జెయింట్స్ కు మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి అసలైన టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రామన్ రహేజా మాట్లాడుతూ.. "దిగ్గజాల క్రికెట్‌ను మళ్లీ చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు సిద్దంగా ఉండండి. షెడ్యూల్‌ను విడుదలచేశాం. ఆన్‌లైన్లో టికెట్లకు సంబంధించి త్వరలోనే వెల్లడిస్తాం. దాదాపు పది దేశాల నుంచి గుర్తింపు పొందిన టాప్ మాజీ ప్లేయర్లు కొత్త ఫార్మాట్‌లో ఆడబోతున్నారు. తప్పకుండా అభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నాం. దిగ్గజ ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఆడతారు" అని అన్నారు.
లెజెండ్స్ లీగ్ షెడ్యూల్
కోల్‌కతాలో సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 18న
లక్నోలో సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 22న
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 26న
కటక్‌లో సెప్టెంబర్ 27న, సెప్టెంబర్ 30న
జోధ్‌పూర్‌లో అక్టోబర్ 1, అక్టోబర్ 3
ప్లే-ఆఫ్‌లు.. అక్టోబర్ 5, అక్టోబర్ 7న వేదికను త్వరలోనే ప్రకటించనున్నారు.