దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, కోచ్ మైక్ ప్రొక్టర్ (77) కన్నుమూశారు. ప్రొక్టర్ మృతితో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మైక్ ప్రోక్టర్ దక్షిణాఫ్రికా అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరు. వర్ణవివక్ష అనంతర కాలంలో దక్షిణాఫ్రికాకు ప్రోక్టర్ మొదటి కోచ్ గా విధులు నిర్వర్తించారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మైక్ ప్రోక్టర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 401 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 21,936 పరుగులు చేసి 1,417 వికెట్లు తీశాడు. 77 ఏళ్ల ప్రొక్టర్‌కు గుండెపోటు రాగా.. దాని కోసం ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారని సమాచారం. సర్జరీ సమయంలో కొంత సమస్య వచ్చింది. ఆ తర్వాత ప్రొక్టర్‌ని ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది.
మైక్ ప్రొక్టర్ భార్య మరైనా న్యూస్ 24తో మాట్లాడుతూ.. "మైక్ ప్రోక్టర్ గుండెపోటుకు గురయ్యాడు.. దాని కోసం అతనికి శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స సమయంలో ప్రోక్టర్ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. దాని కారణంగా అతను ICUలో చేర్చబడ్డాడు. అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దురదృష్టవశాత్తు మళ్ళీ కళ్ళు తెరవలేదని పేర్కొంది.
మైక్ ప్రోక్టర్ అంతర్జాతీయ కెరీర్ మూడు సంవత్సరాలు (1967–1970) కొనసాగింది. ఈ కాలంలో ఆయన ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. తన బౌలింగ్ శైలితో క్రికెట్ ప్రపంచంలో పాపులర్ అయిన ప్రొక్టర్ 15.02 సగటుతో 41 వికెట్లు పడగొట్టి అభిమానులను ఆకట్టుకున్నాడు.