ఆ ఐదుగురిపై క‌న్నేసిన RCB

IPL 2025 మెగా వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.

By Kalasani Durgapraveen  Published on  18 Nov 2024 12:35 PM IST
ఆ ఐదుగురిపై క‌న్నేసిన RCB

IPL 2025 మెగా వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు భారీ బిడ్‌లు వెచ్చించనున్నాయి. అందరి చూపు RCB జట్టుపైనే ఉంది. RCBకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ జట్టులో భాగం కావడంతో.. అత‌ని జట్టులోకి ఎవరు రానున్నార‌నే ఆసక్తి అందరిలో ఉంది.

RCB జట్టు వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఉంచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్ పేర్లు ఉన్నాయి. యష్ దయాల్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జట్టులో ఉన్నాడు. ఇప్పుడు RCB జట్టులో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. అందులో 8 మంది విదేశీయులు కోటా ఉంది.

RCB రూ. 83 కోట్ల పర్స్‌తో మెగా వేలంలోకి వెళుతుంది. వేలంలో ఆర్సీబీ ఇప్పటికే క్యాప్ చేసిన ఆటగాళ్లలో ఎవరినైనా తీసుకురావడానికి మూడు RTM కార్డ్‌లను ఉపయోగించవచ్చు. అటువంటి పరిస్థితిలో RCB జట్టు ఏ ఐదుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల‌నుకుంటుందో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

1.జోస్ బట్లర్

IPL 2025 వేలంలో జోస్ బట్లర్‌ను కొనుగోలు చేయడానికి RCB జట్టు బలమైన ప్రయత్నం చేయనున్న‌ట్లు తెలుస్తుంది. జోస్ బట్లర్‌ను వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో రూ.10 కోట్లకు రాజస్థాన్ జట్టు అతడిని తమ వద్దే ఉంచుకుంది. దీంతో RCB జట్టు బట్లర్‌ను IPL 2025 వేలంలో కొనుగోలు చేయాలనుకుంటోంది.. ఎందుకంటే RCB జట్టు కెప్టెన్ కోసం కూడా వెతుకుతోంది. ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసిన RCB జట్టు.. జోస్ బట్లర్‌ను కొనుగోలు చేసి అతనికి జట్టు కెప్టెన్సీని ఇచ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే జోస్ బట్లర్‌కు T20Iలో ఇంగ్లండ్‌కు నాయకత్వం వహించిన మంచి అనుభవం ఉంది. హై ప్రెజర్ మ్యాచ్‌ల్లో ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోవడంలో బట్లర్ నిష్ణాతుడు. బట్లర్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో ద్విపాత్రాభిన‌యం చేయ‌గ‌ల‌డు. అటువంటి పరిస్థితిలో RCB జట్టు బట్లర్‌ను కొనుగోలు చేయడం ద్వారా దినేష్ కార్తీక్‌లేని కొరతను తీర్చగలదు.

2.కేఎల్ రాహుల్

IPL 2025 వేలంలో RCB జట్టు లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన KL రాహుల్‌ని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. KL రాహుల్ RCBలో చేరుతాడ‌ని చాలా కాలంగా చర్చ జరుగుతోంది.. ఎందుకంటే అతడు గ‌తంలో RCB కి ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో KL రాహుల్ తిరిగి రావడంపైనే అందరి చూపు ఉంది. రాహుల్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్‌లకు కెప్టెన్‌గా ప‌ని చేశాడు. అతని కెప్టెన్సీలో లక్నో జట్టు 3 సీజన్లలో రెండింటిలో ప్లేఆఫ్‌లకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో రాహుల్‌ను కొనుగోలు చేయడానికి RCB జట్టు IPL వేలంలో చాలా డబ్బు వెచ్చించే అవ‌కాశం ఉంది.

3. యుజ్వేంద్ర చాహల్

IPL వేలం 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేయడానికి RCB జట్టు ఆసక్తి చూప‌నుంద‌ని తెలుస్తుంది. వేలానికి ముందు చాహల్‌ను రాజస్థాన్ జట్టు విడుదల చేసింది. చాహల్ 2014 నుండి 2021 వరకు RCBకి ఆడాడు. ఆ తర్వాత 2022 IPL వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 6.50 కోట్లకు కొనుగోలు చేసింది. చాహల్ ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లు ఆడి 250 వికెట్లు.. ఐపీఎల్ 2024లో 18 వికెట్లు తీశాడు. చాహల్ 2023లో 21 వికెట్లు, 2022లో 27 వికెట్లు తీశాడు. అద్భుతమైన ఆటతీరుతో రాణిస్తున్న చాహ‌ల్‌ను RCB జట్టు కొనుగోలు చేసే అవకాశాన్ని వదులుకోలేదు.

4. హర్షల్ పటేల్

IPL 2025 మెగా వేలంలో ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్‌ను RCB జట్టును కొనుగోలు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. IPL మెగా వేలానికి ముందు హర్షల్‌ను పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. అయితే హర్షల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే.. అతనికి వేలంలో భారీ ధ‌ర ద‌క్కే అవ‌కాశం ఉంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున హర్షల్ 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. RCB జట్టు హర్షల్ పటేల్‌ను తిరిగి తీసుకురావాలని కోరుకుంటుంది. హర్షల్‌ను RCB 2012లో 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

5. గ్లెన్ మాక్స్‌వెల్

RCB జట్టు IPL 2025 వేలంలో స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయాలనుకుంటోంది. వేలానికి ముందు RCB బృందం మాక్స్‌వెల్‌ను RTM కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చని నివేదిక‌లు చెబుతున్నాయి. గ్లెన్ మాక్స్‌వెల్ RCB జట్టు మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయగలడని జ‌ట్టు న‌మ్ముతుంది. మాక్స్‌వెల్ శక్తివంతమైన షాట్‌లు ఆడ‌ట‌మే కాకుండా... అతని బౌలింగ్ మిడిల్ ఓవర్లలో జట్టుకు సహకారంగా ఉంటుంది. గ్లెన్ మాక్స్‌వెల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 134 మ్యాచ్‌లు ఆడి 2,771 పరుగులు, 37 వికెట్లు తీశాడు.

Next Story