క్రికెట్ అవ‌కాశ‌మిచ్చింది.. కానీ అత‌డే నిల‌బ‌డ‌లేక‌పోయాడు..!

ఎనిమిదేళ్లు.. సరిగ్గా చెప్పాలంటే 3,011 రోజులు.. కరుణ్ నాయర్ ఇండియా టెస్ట్ జెర్సీలో క‌న‌బ‌డ‌టానికి వేచి ఉన్న స‌మ‌యం

By Medi Samrat
Published on : 21 Jun 2025 6:28 PM IST

క్రికెట్ అవ‌కాశ‌మిచ్చింది.. కానీ అత‌డే నిల‌బ‌డ‌లేక‌పోయాడు..!

ఎనిమిదేళ్లు.. సరిగ్గా చెప్పాలంటే 3,011 రోజులు.. కరుణ్ నాయర్ ఇండియా టెస్ట్ జెర్సీలో క‌న‌బ‌డ‌టానికి వేచి ఉన్న స‌మ‌యం. అత‌డి పునరాగమనం అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేశారు. కానీ అంద‌రూ ఊహించిన విధంగా రీ ఎంట్రీలో మెరుపులు మెరిపించ‌లేక‌పోయాడు. ఎనిమిదేళ్లు జ‌ట్టులో స్థానం కోసం ఎదురుచూసిన నాయ‌ర్‌ పునరాగమనంలో నాలుగో బంతికే వెనుదిరిగి అంద‌రినీ నిరాశ ప‌రిచాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన‌ అవుట్‌స్వింగర్‌ను ఆడిన‌ కరుణ్ ఒల్లీ పోప్ చేతికి చిక్కి పెవిలియ‌న్ చేరాడు. క‌రుణ్ ఆడిన బంతి నేరుగా షార్ట్ కవర్‌లో ఉన్న ఒల్లీ పోప్ చేతుల్లోకి వెళ్లింది. అతడు పోప్‌ ఎడమవైపుకు పూర్తిగా డైవింగ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఎనిమిదేళ్ల త‌ర్వాత టీమిండియా టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా బ‌రిలో దిగిన క‌రుణ్ నిరాశ‌తో వెనుదిరిగాడు.

కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లకు జాతీయ జట్టులో మరిన్ని అవకాశాలు ఇవ్వాలా?

డిసెంబర్ 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో భారత క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్న కరుణ్.. చివరిసారిగా 2017లో టెస్టు ఆడాడు. అప్పటి నుండి అతడు దేశవాళీ క్రికెట్‌లో కష్టపడ్డాడు, పునరాగమనం కోసం ఓపికగా వేచి ఉన్నాడు. డియ‌ర్‌ క్రికెట్.. నాకు మరో అవకాశం ఇవ్వు" అని సెల‌క్ట‌ర్ల‌కు తాను ఉన్నాన‌ని గుర్తుచేశాడు.

అంతేకాదు.. 2024-25 సీజన్‌లో క‌రుణ్ తన బ్యాట్‌తోనే మాట్లాడటానికి ప్ర‌య‌త్నించాడు. అందుకే తొమ్మిది రంజీ ట్రోఫీ గేమ్‌లలో నాలుగు సెంచరీలతో 863 పరుగులు.. ఎనిమిది విజయ్ హజారే ట్రోఫీ ఇన్నింగ్స్‌లలో ఐదు శ‌త‌కాలతో సహా 779 పరుగులు చేసి సెల‌క్ట‌ర్ల దృష్టిలో ప‌ట్టాడు.

Next Story