అసలైన థ్రిల్లర్ ఇదే.. రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ విజయం
ఐపీఎల్-2024 సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:36 AM ISTఅసలైన థ్రిల్లర్ ఇదే.. రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ విజయం
ఐపీఎల్-2024 సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది. దాదాపు సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. ఇప్పుడు ప్లేఆఫ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. దాంతో.. మొదటి నాలుగు స్థానాల్లో ఉండాలని ఆయా టీమ్‌లు తహతహ లాడుతున్నాయి. కాగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. 202 భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్.. కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దాంతో.. హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 4 స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 201/3 పరుగులు చేసింది. ఆ తర్వాత 202 పరుగులు చేయాల్సి ఉండగా రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసిన భువనేశ్వర్ కుమార్ హీరోగా నిలిచాడు. అతనే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. నటరాజన్, ప్యాట్ కమిన్స్ కూడా తలో రెండు వికెట్లు తీశారు. ప్యాట్ కమిన్స్ చివరి వరకు కెప్టెన్‌గా పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 67 పరుగులు, రియాన్ పరాగ్ 49 బంతుల్లో 77 పరుగులు చేసి రాణాంచారు. వీరిద్దరే రెండో వికెట్‌కు 134 పరుగులు జోడించారు.
చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరం అయ్యాయి. ఆ దశలో 19వ ఓవర్‌ను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేశాడు. తొలి బంతికే ధ్రువ్ జురెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. 4 బంతులకు కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. చివరి బంతిని మాత్రం పొవెల్ సిక్స్‌గా మలచడంతో చివరి ఓవర్‌లో రాజస్థాన్‌కు 13 రన్స్ కావాల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్‌ను భువనేశ్వర్ తీసుకున్నాడు. తొలి మూడు బంతులకు 1, 2, 4 పరుగులు వచ్చాయి.
ఆ తర్వా రెండు బంతులకు 2, 2 పరుగులు రావడంతో విజయానికి చివరి బంతికి రాయల్స్‌కు రెండు పరుగులు అవసరం అయ్యాయి. కానీ భువనేశ్వర్ తెలివిగా వేసిన బంతికి పోవెల్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దాంతో.. హైదరాబాద్ టీమ్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. పది మ్యాచ్‌లు ఆడగా హైదరాబాద్ 6 మ్యాచుల్లో గెలుపొందింది.
అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 201/3 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు చేశాడు. జట్టు స్కోర్‌ను 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 58 పరుగులు.. హెన్రిచ్ క్లాస్ 19 బంతుల్లో 42 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌ను ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు, సందీప్ శర్మ 1 వికెట్ తీశాడు.