గెలుపోటములు ఆటల్లో అత్యంత సహజం.. ఎన్నో అంచనాలతో వెళ్లిన జట్లు మొదటి రౌండ్ ను కూడా దాటిన ఘటనలు ఉన్నాయి. పెద్ద పెద్ద జట్లను చిన్న చిన్న జట్లు ఓడించడం.. మంచి ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం సర్వ సాధారణం. టీ20 ప్రపంచకప్ సెమీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ సెమీస్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమికి పాక్ పేసర్ హసన్ అలీ అంటూ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్. పాకిస్తాన్ అభిమానులు హసన్ అలీని, అలీ భార్యను, తల్లిని కూడా ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉన్నారు.
హసన్ అలీ బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత అతడు వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. క్యాచ్ డ్రాప్ తో బతికిపోయిన మాథ్యూ వేడ్ షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు బాది ఆసీస్ కు విజయాన్ని అందించాడు. హసన్ అలీ 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు. ఓవర్‌కు 11 ఎకానమీ రేటు ఉన్నప్పటికీ అతను వికెట్లు పడగొట్టడంలో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాకు గేమ్‌చేంజర్‌గా నిరూపించుకున్న మాథ్యూ వేడ్ క్యాచ్‌ను వదిలివేసిన తర్వాత అతడు ఒక్కసారిగా పాక్ అభిమానులకు విలన్ అయిపోయాడు.
పాక్ అభిమానులు హసన్ అలీని అత్యంత దారుణంగా దూషిస్తూ ఉండగా.. భారత్ అభిమానులు మాత్రం హసన్ అలీకి మద్దతుగా నిలిచారు. క్రికెట్ మ్యాచ్ లలో ఇలాంటివి కామన్ అని చెబుతున్నారు. #INDwithHasanAli అనే ట్యాగ్ తో భారత్ క్రికెట్ అభిమానులు అతడికి మద్దతు తెలిపారు.