టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం.. భ‌విష్య‌త్‌లో ఈ రికార్డ్‌ బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే..!

ఇండోనేషియా ఫాస్ట్ బౌలర్ గేదె ప్రియందన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.

By -  Medi Samrat
Published on : 23 Dec 2025 5:42 PM IST

టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం..  భ‌విష్య‌త్‌లో ఈ రికార్డ్‌ బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే..!

ఇండోనేషియా ఫాస్ట్ బౌలర్ గేదె ప్రియందన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. కంబోడియాపై ప్రియాందన ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 28 ఏళ్ల గేదె ప్రియందన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ప్రియందన తన తొలి ఓవర్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టడం గమనార్హం.

ఇండోనేషియా, కంబోడియా జ‌ట్ల మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. చివరి ఐదు ఓవర్లలో కంబోడియా విజయానికి 62 పరుగులు చేయాల్సి ఉండగా ఐదు వికెట్లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఇండోనేషియా కెప్టెన్ ప్రియందన చేతికి బంతిని అందించడంతో కంబోడియా ఆశలను వమ్ము చేశాడు. ప్రియందన తొలి మూడు బంతుల్లోనే షా అబ్రార్ హుస్సేన్, నిర్మల్‌జిత్ సింగ్, చంతియోన్ రత్నక్‌లను అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత డాట్ బాల్ వేశాడు. ఐదో బంతికి మోంగ్దారా సోక్‌ను అవుట్‌ చేశాడు. దీని తర్వాత వైడ్‌ బాల్‌ వేసిన ప్రియాందన పెల్‌ వెనక్‌ను ఔట్‌ చేసి ఇండోనేషియాకు విజయాన్ని అందించాడు. కంబోడియా 107 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గేదె ప్రియాందన నిలిచాడు. ఇంతకు ముందు అమీన్ హుస్సేన్, అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించారు. 2013–14 విక్టరీ డే T20 కప్‌లో UCB-BCB XI తరపున ఆడుతున్న హుస్సేన్.. అబాహానీ లిమిటెడ్‌పై ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మిథున్ 2019-20లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతూ హర్యానాపై ఈ ఫీట్ సాధించాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్ ఒక ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సందర్భాలు 14 ఉన్నాయి. కానీ, ఒక బౌలర్‌ ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

Next Story