టీమిండియా బ్యాట‌ర్ల‌ విధ్వంసం.. భారీ టార్గెట్‌ను ఊదేశారు..!

శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో టీమిండియా, కివీస్ జ‌ట్ల‌ మధ్య జ‌రిగిన రెండ‌వ టీ20 మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది.

By -  Medi Samrat
Published on : 24 Jan 2026 6:20 AM IST

టీమిండియా బ్యాట‌ర్ల‌ విధ్వంసం.. భారీ టార్గెట్‌ను ఊదేశారు..!

శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో టీమిండియా, కివీస్ జ‌ట్ల‌ మధ్య జ‌రిగిన రెండ‌వ టీ20 మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. హై స్కోరింగ్ మ్యాచ్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. భారత ఓపెనింగ్ జోడీ విఫలమవగా.. త‌ర్వాత వ‌చ్చిన ఇషాన్ కిషన్ (76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (82) విధ్వంస‌క‌ర‌ ఇన్నింగ్స్‌ల‌తో రెండో టీ20లో 7 వికెట్ల (15.2 ఓవర్లలో) న్యూజిలాండ్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడి భారత్‌కు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్), రచిన్ రవీంద్ర (44) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు. ఈ మ్యాచ్ భారత గడ్డపై జరిగిన 100వ టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ కావ‌డం విశేషం.

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. 7 బంతుల్లోనే భారత ఓపెనర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. తొలి ఓవర్ 5వ బంతికి సంజూ శాంసన్ వికెట్ కోల్పోగా, రెండో ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. సంజు 5 బంతుల్లో 6 పరుగులు చేయగా, అభిషేక్ ఖాతా కూడా తెరవలేదు. దీని తర్వాత ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూనే సూర్యకుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు. ఇషాన్ వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా బౌండరీలు బాదుతూ 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ‌రో ప‌క్క‌ సూర్య కూడా గేరు మార్చి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 48 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని ఇషా సోధి బ్రేక్ చేశాడు.

ఇషాన్ 237.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 32 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, ఇతర తోటి ఆటగాళ్లు మెచ్చుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 ఇంటర్నేషనల్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. 14 నెలలు 23 ఇన్నింగ్స్‌ల తర్వాత అర్ధ సెంచ‌రీ చేశాడు. అంతకుముందు సూర్య 12 అక్టోబర్ 2024న హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ (75) చేశాడు.

ఇషాన్ కిష‌న్ ఔటైన త‌ర్వాత‌ శివమ్ దూబే సూర్యకు మద్దతు ఇస్తూనే చెల‌రేగాడు. వచ్చిన వెంటనే స్పిన్నర్లను టార్గెట్ చేసుకుని మంచి బౌండరీలు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 82 పరుగులతో, దూబే 18 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ భారత బౌలర్లపై విపరీతమైన ఒత్తిడి తెచ్చింది. తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు చేశాడు. తొలి రెండు ఓవర్లలో కివీ బ్యాట్స్‌మెన్ మొత్తం ఆరు ఫోర్లు కొట్టారు. అయితే, నాలుగో ఓవర్ రెండో బంతికి హర్షిత్ రాణా అద్భుతంగా పునరాగమనం చేసి డెవాన్ కాన్వాయ్ వికెట్ తీశాడు. అప్ప‌టికే న్యూజిలాండ్ స్కోరు 43 పరుగులు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి తన తొలి బంతికే వికెట్ తీశాడు. వ‌రుణ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఫెర్ట్ 13 బంతుల్లో ఐదు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. వరుసగా రెండు వికెట్లు పడినప్పటికీ న్యూజిలాండ్ దూకుడు ధోరణిలో మార్పు రాలేదు. ఆ త‌ర్వాత రచిన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించి భారత బౌలర్లను విధ్వంసకర రీతిలో దెబ్బతీశాడు. అతడు 20 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. అతనికి గ్లెన్ ఫిలిప్స్ మద్దతు ఇచ్చాడు, అతడు 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు, అయితే ఎనిమిదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హార్దిక్‌కి క్యాచ్ ఇచ్చి ఫిలిప్స్ ఔట‌య్యాడు.

అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 98 పరుగులు. దీని తర్వాత డారిల్ మిచెల్ వేగంగా పరుగులు చేసే క్ర‌మంలో కేవలం ఆరు బంతుల్లో 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. 10.1 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్లకు 113 పరుగులు చేసింది. రన్ రేట్ 11 కంటే ఎక్కువగా ఉంది. ఆ త‌ర్వాత‌ మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో అజేయంగా 47 పరుగులు చేశాడు. దీంతో కివీస్ 20 ఓవ‌ర్ల‌లో 208 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో కుల్‌దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీయ‌గా.. హ‌ర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా ఒక వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు.

Next Story