మెరిసిన శాంసన్.. రెండో వన్డేలో భారత్ జయభేరి
India Won By 5 Wickets To Clinch Series 2-0.
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2022 7:59 AM ISTతొలి వన్డేలో ఏ మాత్రం పోటీ ఇవ్వని జింబాబ్వే..రెండో వన్డేలో మాత్రం కాస్త పోరాడింది. ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేయగా.. బౌలర్లు మాత్రం తమకు సాధ్యమైనంత మేరకు టీమ్ఇండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయినా రెండో వన్డేలో ఐదుగురు బ్యాటర్లని పెవిలియన్‌కు చేర్చారు. దీంతో విజయం కోసం భారత్ ను కొంచెం కష్టపడేలా చేశారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమైంది.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. సీన్ విలియమ్స్ (42), ర్యాన్ (39 నాటౌట్) మాత్రమే రాణించగా.. మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఓ వికెట్ తీశారు.
గాయం కారణంగా ఐపీఎల్ తరువాత క్రికెట్ కు దూరంగా ఉన్నకెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసియా కప్‌కు ముందు లయ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే.. 5 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యాడు. న్యాచి బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా ఆడి దొరికిపోయాడు. ఈ దశలో ధావన్ (33)తో జతకలిసిన శుభ్‌మన్ గిల్ (33) మరోసారి ఆకట్టుకున్నాడు. మరోసారి వీరిద్దరే మ్యాచ్‌ను ముగించేలా కనిపించారు. అయితే.. ఈ సారి జింబాబ్వే బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేసి కాస్త పోటినిచ్చారు. చివాంగా బౌలింగ్‌లో ధావన్ ఔట్ కాగా.. జాంగ్వె తన వరుస ఓవర్లలో ఇషాన్ కిషన్(6),గిల్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో జింబాబ్వే శిబిరంలో ఎక్కడో ఓ మూల చిన్న ఆశ మొదలైంది.
అయితే.. సంజూ శాంసన్ ( 43 నాటౌట్; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దీపక్ హుడా(25) ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ అలవోకగా బౌలర్లను ఎదర్కొంటూ వేగంగా లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. విజయానికి కొద్ది దూరంలో దీపక్ హుడా ఔటైనా.. అక్షర్ పటేల్(6)తో కలిసి శాంసన్ జట్టును గెలిపించాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ మూడు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన శాంసన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. నామమాత్రమైన ఆఖరి వన్డే సోమవారం జరగనుంది.