చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుని ఇంగ్లండ్‌పై భారత్ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ కూడా 78 పరుగులు చేసి రాణించాడు. విరాట్ కోహ్లీ 52 పరుగులు చేశాడు.
ఛేదనలో ఈసారి కూడా ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ఇంగ్లండ్ 6.2 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఇక్కడే అర్ష్‌దీప్ సింగ్ బెన్ డకెట్‌ను అవుట్ చేయడం ద్వారా భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. డకెట్ 22 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. స్కోరు 80 వద్ద అర్ష్‌దీప్.. ఫిల్ సాల్ట్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. సాల్ట్ 23 పరుగులు చేశాడు. టామ్ బెంటన్, జో రూట్ భాగస్వామ్యం నిలదొక్కుకుంటున్న సమయంలో కుల్దీప్ బెంటన్(38)ను అవుట్ చేశాడు. రూట్‌ను బౌల్డ్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ భారత్‌కు నాలుగో వికెట్ అందించాడు. రూట్ 24 పరుగులు చేసి అఉటయ్యాడు. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. లియామ్ లివింగ్‌స్టన్ తొమ్మిది, ఆదిల్ రషీద్ 0, మార్క్ వుడ్ తొమ్మిది పరుగులు చేసి ఔట్ అయ్యారు.
అంతకుముందు భారత్‌కు శుభారంభం లభించలేదు. కటక్‌లో సెంచరీ చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ, గిల్ 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మళ్లీ ఫామ్‌ని పుంజుకున్న కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. రషీద్ వేసిన బంతికి కోహ్లి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు. కోహ్లీ నిష్క్రమణ తర్వాత శ్రేయాస్ అయ్యర్ గిల్‌కు మద్దతుగా నిలిచాడు. గిల్ 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో గిల్‌కి ఇది ఏడో సెంచరీ. స్కోరు 226 వద్ద గిల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో గిల్ సెంచరీ సాధించాడు.
గిల్ నిష్క్రమణ తర్వాత కూడా అయ్యర్ తన దూకుడును తగ్గించుకోలేదు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింత దూకుడు పెంచాడు. అయితే 78 పరుగుల వద్ద రషీద్ వేసిన 39వ ఓవర్ రెండో బంతికి అవుటయ్యాడు. 64 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లో కనిపించినా 40కి మించి దాటలేకపోయాడు. 29 బంతులు ఎదుర్కని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. హార్దిక్ పాండ్యా 17 పరుగులు, అక్షర్ పటేల్ 13, వాషింగ్టన్ సుందర్ 14, హర్షిత్ రాణా 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ తరఫున రషీద్ నాలుగు, వుడ్ రెండు వికెట్లు తీశారు. సకిబ్ మహమూద్, గుస్ అట్కిన్సన్, జో రూట్ తలో వికెట్ తీశారు.