ధర్మశాల టెస్టు.. విజ‌యం సాధించి 112 ఏళ్ల రికార్డును భార‌త్‌ సమం చేస్తుందా.?

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.

By Medi Samrat  Published on  4 March 2024 3:04 PM IST
ధర్మశాల టెస్టు.. విజ‌యం సాధించి 112 ఏళ్ల రికార్డును భార‌త్‌ సమం చేస్తుందా.?

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 3-1తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టులో విజయం సాధించడం ద్వారా టీమిండియా ప్రత్యేక రికార్డును సమం చేయ‌నుంది. భారతదేశం మొదటి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీని తర్వాత రోహిత్ అండ్ కంపెనీ అద్భుతంగా పునరాగమనం చేసి మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలుచుకుంది.

ధర్మశాలలో జరగ‌నున్న‌ ఐదో టెస్టులో భార‌త్‌ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్ల స‌రస‌న నిల‌వ‌నుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకూ కేవలం రెండు జట్లు మాత్రమే బలమైన పునరాగమనం చేసి మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఆస్ట్రేలియా రెండుసార్లు, ఇంగ్లండ్ ఒకసారి ఇలా రికార్డు సిరీస్ విజ‌యాలు న‌మోదు చేశాయి. 112 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ చివరిసారి ఇలా చేసింది. 1912లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన త‌ర్వాత‌ పునరాగమనం చేసి మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా దీనిని 1897-98, 1901-02లో విజ‌యాలు న‌మోదు చేసింది.

దీంతో భారత్ ఈ రెండు జట్ల స‌ర‌స‌న చేరే అవకాశం వచ్చింది. గత 112 ఏళ్లలో తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్‌లో మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ విజయం సాధించిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత భారత్ బలమైన పునరాగమనం చేసి విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 106 పరుగులతో, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో 434 పరుగులతో, ఆ తర్వాత రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సొంతగడ్డపై భారత్‌ వరుసగా 17వ టెస్టు సిరీస్‌ గెలిచి రికార్డు సృష్టించింది. ఈ విజయ పరంపర 22 ఫిబ్రవరి 2013 నుండి ఇప్పటి వరకు కొనసాగుతోంది. 1994 నుంచి 2001 వరకు స్వదేశంలో వరుసగా 10 టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన తర్వాత పునరాగమనం చేసిన భారత్ ఏడోసారి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. కెప్టెన్ స్టోక్స్, కోచ్‌ బ్రెండన్ మెకల్లమ్ రాక తర్వాత ఇంగ్లండ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి. స్టోక్స్, మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.

Next Story