వైజాగ్‌లో విజయం వరించేనా..?
India vs South Africa 3rd T20I in YS Rajasekhara Reddy Stadium today.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిలవాలంటే
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2022 5:05 PM ISTఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిలవాలంటే నేడు(మంగళవారం) విశాఖ వేదికగా జరిగే మూడో టీ20లో టీమ్ఇండియా తప్పక విజయం సాధించాల్సి ఉంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచులను చేజార్చుకున్న భారత జట్టు మూడో మ్యాచులో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోరు మీదున్న సపారీ సేనను అడ్డుకోవడం పంత్ సేనకు సవాలే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమి లను విశ్రాంతి నివ్వగా.. సిరీస్ ఆరంభానికి ముందే కే ఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్ దూరం అయ్యారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కుర్రాళ్లతో నిండిన టీమ్ఇండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాను మట్టి కరిపిస్తుందని అంతా బావించగా.. గత రెండు మ్యాచ్‌ల్లో సమిష్టి ప్రదర్శన కనబర్చడంలో విఫలమైన రిషబ్ పంత్ సారథ్యంలోని టీమ్ఇండియా సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉంది.
అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో పంత్ జట్టును ఎలా నడిపిస్తాడు అన్నదానిపైనే ఆసక్తి నెలకొంది. తన వ్యూహాలకు పదను పెట్టకపోతే కెప్టెన్‌గా తొలి సిరీస్ తీవ్ర పరాభవాన్ని మిగిల్చే ఆస్కారం ఉంది. ఇక బ్యాట్స్‌మెన్‌గా అతడు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇషాన్, శ్రేయస్ నిలకడగా రాణిస్తుండగా.. దినేష్ కార్తిక్ కూడా ఫర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించాల్సి ఉంది. రెండు మ్యాచుల్లో విఫలమైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా ఈమ్యాచ్‌లో బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగం ఒక్క భువనేశ్వర్ కుమార్ తప్ప మిగిలిన అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఆవేశ్‌ఖాన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతడి స్థానంలో ఆర్ష్‌దీప్ జట్టులోకి రావొచ్చు.
ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే..అంచనాలకు మించి రాణిస్తొంది. తొలి మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, డస్సెన్ అదరగొడితే..క్లాసెన్ ఖతర్నాక్ ఆటతో రెండో మ్యాచ్ గెలిపించాడు. ఇదే ఊపులో మూడో మ్యాచ్‌లో గెలిచి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని దక్షిణాఫ్రికా బావిస్తోంది. ఇక చేతి గాయం కారణంగా డికాక్ మిగతా మ్యాచ్‌లు ఆడేది అనుమానమే అయినప్పటికి వాండర్ డసెన్, హెన్రిక్స్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్‌తో కూడి బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. రబాడ, పార్నెల్, నోకియాతో కూడిన పేస్ త్రయం.. షంసి, కేశవ్ మహారాజ్ స్పిన్ ద్వయాన్ని ఎలా ఎదుర్కొంటారో అన్నదానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.