సిరీస్‌పై టీమ్ఇండియా కన్ను.. దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టీ20 నేడే
India vs South Africa 2nd T20 match today.టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా ఆడుతున్న చివరి సిరీస్ ఇదే.
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2022 9:22 AM GMTటీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా ఆడుతున్న చివరి సిరీస్ ఇదే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా నేడు గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు విజృంభించడంతో అలవోకగా విజయం సాధించింది భారత్. అయితే.. డికాక్, మార్‌క్రమ్, మిల్లర్, స్టబ్స్ లాంటి విధ్వంసర ఆటగాళ్లతో కూడిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం అయ్యాడు. ప్రపంచకప్ నాటికి కోలుకుంటాడని భావిస్తున్నప్పటికీ దాదాపు అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అన్నది ప్రశ్నగా మారింది. ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియా కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున ఇంత తక్కువ సమయంలో ఎంత మంది ఆటగాళ్లను పరీక్షిస్తుందో చూడాలి.
ఇప్పటికే ఆల్ రౌండర్ జడేజా ప్రపంచకప్‌కు దూరం కాగా..ఈ సిరీస్‌లో ఇంకెవరైనా గాయపడి ప్రపంచకప్‌కు దూరం అవుతారా అన్న భయం జట్టు మేనేజ్‌మెంట్‌ను వెంటాడుతోంది. సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండగా ఓపెనర్ రాహుల్ లయ అందుకోవడం టీమ్ ఇండియాకు సానుకూల అంశం. బుమ్రా స్థానంలో ఈ సిరీస్‌కు పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసినా అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. తొలి మ్యాచ్‌లో పంత్, కార్తీక్ ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
వీరిద్దరికి బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలని మేనేజ్‌మెంట్ భావిస్తే మరోసారి వీరిద్దరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఒకవేళ వీరిద్దరి బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఏ మాత్రం ఉపయోగించుకుంటారో చూడాల్సిందే. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ ల నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే ఆశిస్తోంది భారత్.
తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా తడబడింది. కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని బలంగా పోటీ నిస్తామని ఆ జట్టు కెప్టెన్ బవుమా ఇప్పటికే స్పష్టం చేశాడు. బ్యాట్స్‌మెన్లు ఓ మోస్తరు పరుగులు సాధించినా రబాడ, నోకియా, పార్నెల్, షంసిలతో కూడిన బౌలింగ్ విభాగం లక్ష్యాన్ని కాపాడుకోగలదు.
ఇక ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్ బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు బాగా అనుకూలిస్తుంది. క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్లు పరుగులు చేయొచ్చు.