ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డే నేడు.. గెలిస్తేనే నిలిచేది

India vs South africa 2nd ODI Match Today.ద‌క్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను గెలిచిన టీమ్ఇండియా అదే ఊపులో వ‌న్డే సిరీస్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 9:09 AM IST
ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డే నేడు.. గెలిస్తేనే నిలిచేది

రాంచీ : ద‌క్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను గెలిచిన టీమ్ఇండియా అదే ఊపులో వ‌న్డే సిరీస్‌ను ద‌క్కించుకోవాల‌ని ఆరాట ప‌డ‌గా.. తొలి వ‌న్డేలో స‌ఫారీలు గ‌ట్టి షాక్ ఇచ్చారు. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో ద‌క్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సిరీస్‌లో నిల‌బ‌డాలి అంటే టీమ్ఇండియా నేడు(ఆదివారం) జ‌రిగే రెండో వ‌న్డేలో త‌ప్ప‌క‌గెల‌వాల్సిన ప‌రిస్థితి ఉంది.

సీనియ‌ర్ ఆట‌గాళ్ల గైర్హాజ‌రీలో యువ‌కుల మేళ‌వింపుతో బ‌రిలోకి దిగింది భార‌త్‌. తొలి వ‌న్డేలో ఇషాన్ కిష‌న్‌, రుతురాజ్ గైక్వాడ్ వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం కాగా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజు శాంస‌న్ స‌త్తా చాటినా ఫ‌లితం లేక‌పోయింది. గాయం కార‌ణంగా దీప‌క్ చాహ‌ర్ కూడా దూరం కావ‌డంతో తుది జ‌ట్టు ఎంపిక సంక్లిష్ట‌మైంది. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ఆవేష్ ఖాన్ లు ఆశించిన మేర రాణించ‌లేదు. దీంతో రెండో వ‌న్డేలో అరంగ్రేటం చేయ‌ని బెంగాల్ పేస‌ర్ ముకేశ్ కుమార్‌కు అవ‌కాశం ద‌క్కొచ్చు.

తొలి వ‌న్డేలో విఫ‌లం అయిన కెప్టెన్‌ ధవన్‌, గిల్‌, ఇషాన్‌కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్ లు స‌త్తా చాటాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. శ్రేయాస్‌ అయ్యర్‌, శాంసన్ ల నుంచి మ‌రోసారి అలాంటి ఇన్నింగ్స్‌నే ఆశిస్తోంది. ఇక కుల్దీప్‌ యాదవ్‌కు జోడీగా బెంగాల్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌కు అరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు స‌ఫారీలు రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్‌కు సిద్ద‌మ‌య్యారు. కెప్టెన్ బ‌వుమా ఫామ్ ఒక్క‌టే ఆ జ‌ట్టుకు ఆందోళ‌న క‌లిగిస్తోంది. టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు ఇంకా ఎంతో దూరం లేక‌పోవ‌డంతో ఈ మ్యాచ్‌లో ఫామ్ అందుకోవాల‌ని బ‌వుమా బావిస్తున్నాడు. డేవిడ్ మిల్ల‌ర్‌, క్లాసెన్‌, క్వింట‌న్ డికాక్‌లు సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిని ఎంత త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేర్చుతారు అన్న‌దానిపైనే భార‌త విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. రబాడ నేతృత్వంలోని పేస్‌ దళం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు పరీక్ష పెడుతోంది.

రెండో వ‌న్డేకు వ‌రుణుడి ముప్పు స్వ‌ల్పంగా ఉంది. జేఎస్‌సీఏ స్టేడియంలోని పిచ్ సాధార‌ణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. గ‌త అయిదు వ‌న్డేల్లో మూడు సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 280+స్కోర్లు న‌మోదు అయ్యాయి.

Next Story