రేపే నాలుగో టీ20.. సంజూ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తాడా..?

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్లు నాలుగో మ్యాచ్ ఆడనున్నాయి.

By -  Medi Samrat
Published on : 27 Jan 2026 4:26 PM IST

రేపే నాలుగో టీ20.. సంజూ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తాడా..?

సంజు శాంసన్  

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్లు నాలుగో మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. అయినా.. ఓపెనర్ సంజు సామ్సన్ ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటివరకు ఆటలోని ప్రతి విభాగంలోనూ ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు.. న్యూజిలాండ్‌తో జరిగే నాల్గవ టీ20 మ్యాచ్‌లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడ‌ద‌ని భావిస్తోంది.

అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. భారత్‌ మొదటి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఇద్దరు కీలక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ప్రపంచ కప్‌కు ముందు ఈ సిరీస్‌లో బౌలింగ్ విభాగంలో భారత్ తన అత్యున్నత స్థాయి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని చూస్తోంది. కానీ ప్రస్తుతం బ్యాటింగ్‌లో మాత్రం అజేయంగా ఉంది.

ఈ సిరీస్‌లో భారత్‌కు ఆందోళన కలిగించే ఏకైక విషయం సంజు సామ్సన్ పేలవమైన ఫామ్‌. అతడు మూడు మ్యాచ్‌ల్లో 5.33 సగటుతో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ జట్టులో అతని స్థానం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే, తిలక్ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో జట్టు యాజమాన్యం సంజుకు తనను తాను నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇవ్వవచ్చు. జట్టు యాజమాన్యం సంజును మూడో స్థానంలో ఆడించడాన్ని కూడా పరిగణించవచ్చు. అలా జరిగితే.. కిషన్ అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.

వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఇప్పటివరకు జరిగిన టీ20 సిరీస్‌లో గొప్పగా రాణించలేదు. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ అప్పుడప్పుడు మంచి ఫామ్‌ను కనబ‌రిచారు. కానీ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్ దూకుడును అడ్డుకోవ‌డంలో విఫలమయ్యారు. జాకబ్ డఫీ అత్యంత పొదుపుగా10.30 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేశారు. మాట్ హెన్రీ (13.80), కైల్ జామిసన్ (14.20), మిచెల్ సాంట్నర్ (13.14), ఇష్ సోధి (12.50) భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు.

Next Story