వార్మప్ మ్యాచ్ లో భారత్ విజయానికి వారే కారణమా..?
India vs Australia Warm-Up Match. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. బుమ్రా స్థానంలో భారత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (3/4) ఒకే ఓవర్ లో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. చివరి నాలుగు బంతుల్లో ఓ రనౌట్ సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కమ్మిన్స్ క్యాచ్ ను బౌండరీ లైన్ లో విరాట్ కోహ్లీ పట్టడం కూడా మ్యాచ్ లో భారత్ విజయానికి కారణమైంది. అంతకు ముందు టిమ్ డేవిడ్ ను రనౌట్ చేశాడు కోహ్లీ.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), హార్దిక్ (2) నిరాశ పరిచారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76) రాణించడంతో చివరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 16 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. 19వ ఓవర్ తొలి బంతికే ఫించ్ ను హర్షల్ పటేల్ బౌల్డ్ చేశాడు. టిమ్ డేవిడ్ (5)ను కోహ్లీ రనౌట్ చేశాడు. ఆ ఓవర్లో ఐదు పరుగులే రాగా.. ఆఖరి ఓవర్లో ఆసీస్ కు 11 పరుగులు అవసరమయ్యాయి. షమీ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులకు కమిన్స్ రెండు డబుల్స్ తో నాలుగు పరుగులు రాబట్టాడు. ఆఖరి నాలుగు బాల్స్ లో ఆసీస్ కు 7 రన్స్ అవసరం అవ్వడంతో.. మూడో బాల్ కు కమిన్స్ ను అతను ఔట్ చేయగా.. నాలుగో బంతికి అగర్(0) రనౌటయ్యాడు. తర్వాతి రెండు బంతుల్లో ఇంగ్లిస్ (1), కేన్ రిచర్డ్ సన్ (0) లను షమీ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ గెలిచింది. భారత్ తర్వాతి వార్మప్ గేమ్ కివీస్ తో బుధవారం జరగనుంది.