స‌మం చేస్తారా..? అప్ప‌గించేస్తారా..?

India vs Australia 2nd T20I Match today నాగ్‌పూర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ద‌మైంది భార‌త్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sept 2022 3:03 PM IST
స‌మం చేస్తారా..? అప్ప‌గించేస్తారా..?

గెలిచే స్థితిలో ఉండి చేజేతులా మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌ర్థుల‌కు అప్ప‌గించ‌డం ఇటీవ‌ల కాలంలో అల‌వాటుగా మార్చుకుంది టీమ్ఇండియా. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముంగిట జ‌ట్టు ఆట‌తీరు ఆందోళ‌న క‌లిగిస్తోండ‌గా శుక్ర‌వారం నాగ్‌పూర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ద‌మైంది. తొలి టీ20లో ఘోర ప‌రాభ‌వం త‌రువాత సిరీస్‌పై ఆశ‌లు నివాలంటే నేడు త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితిలో ఉంది రోహిత్ సేన‌. మ‌రి ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేస్తుందా..? అన్న‌ది చూడాల్సిందే.

బుమ్రా, షమీ గైర్హాజరీలో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూప‌లేక‌పోతున్నారు. రెండొంద‌ల‌కు పై చిలుకు ల‌క్ష్యాన్ని సైతం కాపాడుకోలేక‌పోతున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో 'బూమ్‌ బూమ్‌ బుమ్రా' బరిలోకి దిగే అవకాశాలున్నాయి. గ‌త మ్యాచ్‌లో విఫ‌లం అయిన దినేశ్ కార్తిక్ స్థానంలో రిష‌బ్‌పంత్‌కు చోటు ద‌క్కుతుందా..? జ‌ట్టు కూర్పు ఎలా ఉండ‌బోతుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది.

టీమ్ఇండియాకు మొహాలిలో త‌గిలింది మామూలు షాక్ కాదు. 209 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిలిపి కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు ప‌డ‌గొట్టి మ్యాచ్‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో పేల‌వ బౌలింగ్ కార‌ణంగా చేజేతుగా ఓట‌మిని కొని తెచ్చుకుంది. దీనికి తోడు పేల‌వ ఫీల్డింగ్ కూడా భార‌త్‌కు స‌మ‌స్య‌గా మారింది. బ్యాటింగ్‌లోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే నెలలో ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో కంగారూలతో సిరీస్‌ను రిహార్సల్‌గా వినియోగించుకొని లోపాలు సరిదిద్దుకోవాలనుకున్న భారత్‌కు మరిన్ని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి.

అన్నింటికి క‌న్నా ముఖ్యంగా డెత్ ఓవ‌ర్లు భార‌త్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఒకప్పుడు డెత్ ఓవ‌ర్ల స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న భువ‌నేశ్వ‌ర్‌.. ఆసియా క‌ప్‌లో రెండు కీల‌క మ్యాచుల‌తో పాటు ఆసీస్‌తో తొలి టీ20లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. దీంతో బుమ్రాపైనే జ‌ట్టు మేనేజ్‌మెంట్ గంపెడు ఆశ‌లు పెట్టుకుంది. ఒక్క ఆటగాడితో మ్యాచ్‌ గమనం మారుతుందనుకోవడం అత్యాశే అయినా.. అతడి రాకతోనైనా బౌలింగ్‌ గాడిన పడితే అదే చాలు. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, చాహ‌ల్‌లు తొలి టీ20లో ధారాళంగా ప‌రుగులు ఇచ్చారు. వారు గాడిన ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇక బ్యాటింగ్‌లో రోహిత్ శ‌ర్మ ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఆసియాక‌ప్ ఊపును కోహ్లీ కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు. రాహుల్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్థిక్ పాండ్య ఫామ్‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంది. తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఆసీస్‌కు కొండంత ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది అన‌డంలో సందేహం లేదు. ఫామ్‌లో ఉన్న గ్రీన్‌కు తోడు మ‌రో ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్ జోరు అందుకుంటే ఆసీస్ కు తిరుగు ఉండ‌దు.

విద‌ర్భ పిచ్ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు స‌మానంగా స‌హ‌క‌రిస్తుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్లే ఎక్కువ‌గా విజ‌యం సాధించాయి. చేధ‌న క‌ష్టం. కాబ‌ట్టి నేటి మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉంది.

Next Story