ధోని సూచనలు ఇచ్చినా కోహ్లీ తీసుకోలేదా..?
India Pakistan Match Updates. పాకిస్తాన్ చేతిలో భారత్ ప్రపంచ కప్ లో ఓడిపోవడంతో మ్యాచ్ ఓడిపోడానికి పలు కారణాలు
By Medi Samrat Published on 25 Oct 2021 2:37 PM GMTపాకిస్తాన్ చేతిలో భారత్ ప్రపంచ కప్ లో ఓడిపోవడంతో మ్యాచ్ ఓడిపోడానికి పలు కారణాలు బయటకు వస్తూ ఉన్నాయి. భారత బృందంతో మహేంద్ర సింగ్ ధోనీ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే..! అయితే పాక్ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ ధోని సూచనలను పట్టించుకోలేదనే వాదన బయటకు వచ్చింది. టీమిండియా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ ఎప్పటికప్పుడు తన సందేశాన్ని ఫీల్డ్‌లోని విరాట్ కోహ్లికి పంపించే ప్రయత్నం చేశాడు. ఇషాన్ కిషన్‌ను ధోని ఎంచుకున్నాడు. కాస్త సమయం దొరికినా.. వాటర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు పట్టుకొని ఫీల్డ్‌లోకి పరుగెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్ ధోనీ సందేశాన్ని విరాట్‌కు చేరవేసే ప్రయత్నం చేశాడు.
కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉన్నాడనే వాదన బయటకు వచ్చింది. కోహ్లి, పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తర్వాత ఎవరు బ్యాటింగ్‌కు రావాలో క్రీజులో నుంచే డ్రెస్సింగ్ రూమ్‌కు సందేశం పంపించాడు విరాట్. రైట్‌హ్యాండ్ అయిన తాను ఔటైతే హార్దిక్, పంత్ ఔటైతే జడేజా రావాలన్నది అతని ప్లాన్. అందుకు తగినట్లే పంత్ ఔటవగానే జడేజా వచ్చాడు. ఈ విషయంలో ధోనీ ఇచ్చిన సూచనను కోహ్లి పట్టించుకోలేదు. 15 ఓవర్లు పూర్తయినా కూడా కోహ్లి, జడేజా స్కోరు వేగాన్ని పెంచలేకపోయారు. ఇక ఫీల్డింగ్ సమయంలోనూ గాయపడిన పాండ్యా స్థానంలో ఇషాన్ కిషన్‌నే ధోనీ పంపించాడని అంటున్నారు. అయినా మ్యాచ్ ఘోరంగా ఓడిపోవడాన్ని భారత అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.