డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో భారత్ ఏ స్థానంలో ఉందంటే?
వైజాగ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ మీద భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By Medi Samrat Published on 5 Feb 2024 3:00 PM GMTవైజాగ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ మీద భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ టెస్టులో ఓటమితో ఐదో స్థానానికి పడిపోయిన భారత్.. వైజాగ్ లో విజయంతో మళ్లీ రెండో స్థానానికి చేరింది. డబ్ల్యూటీసీ 2023-25 స్టాండింగ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ ఈ డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25)లో ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి రెండింటిలో ఓడి ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా భారత్.. 52.77 పర్సంటేజ్‌తో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆసీస్.. పది మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో విజయాలు సాధించి మూడు ఓడిపోయి ఒకటి డ్రా చేసుకుంది. ఆ జట్టు 55 పర్సంటేజ్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
విశాఖ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. రెండో టెస్టు మ్యాచ్‌లో మరో రోజు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సరీస్‌ను తాజా గెలుపుతో టీమిండియా 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 396 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇక 399 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది.