తొలి వన్డేలో ఘోర పరాజయం మూటగట్టుకున్న కోహ్లీ సేన
India Lost First Odi. కరోనా విరామం తరువాత భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. సిడ్ని వేదికగా ఆస్ట్రేలియా
By Medi Samrat
కరోనా విరామం తరువాత భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. సిడ్ని వేదికగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన తొలి వన్డేల్లో 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా హార్థిక్ పాండ్యా (90 76 బంతుల్లో 7 పోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (74 86 బంతుల్లో 10పోర్లు) రాణించినప్పటికి మిగతా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308పరుగులకు మాత్రమే పరిమితమైంది.
375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్(22 18 బంతుల్లో 2 పోర్లు, 1 సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ టీ20 స్టైల్‌లో ఆడుతూ.. ఓవర్‌కు 10 పైగా రన్‌రేట్ మెయింటైన్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు రాబట్టారు. హజిల్‌వుడ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి మయాంక్ ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కోహ్లి(21 21 బంతుల్లో 2 పోర్లు, 1 సిక్స్) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. వెంటనే అయ్యర్(2) కూడా ఔటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్నకేఎల్ రాహుల్ (12 15 బంతుల్లో 1పోర్ ) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కోహ్లీ, అయ్యర్ ను హజిల్‌వుడ్ పెవిలియన్ చేర్చగా.. రాహుల్ ను జంపా ఔట్ చేశాడు. దీంతో 101 పరుగులకే నాలుగు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న శిఖర్ ధావన్- హార్థిక్ పాండ్య
కష్టాల్లో పడిన భారత జట్టును హార్థిక్ పాండ్య, శిఖర్ ధావన్ జోడి ఆదుకుంది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హార్థిక్ ధాటిగా బ్యాటింగ్ చేయగా.. శిఖర్ అతడికి సహకరించాడు. వీరిద్దరిని స్వల్ప తేడాతో జంపా ఔట్ చేయడంతో భారత ఓటమి ఖాయమైంది. ఆఖర్లో రవీంద్ర జడేజా (25 37 బంతుల్లో 1 సిక్స్), నవదీప్ సైనీ( 29 35 బంతుల్లో 1 పోర్, 1 సిక్స్), మహ్మద్ షమీ (13 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు ఓ మోస్తార్‌గా బ్యాటింగ్ చేయడంతో.. భారత్ 300 పరుగుల మార్క్‌నైనా దాటగలిగింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీయగా.. హజిల్‌వుడ్ మూడు వికెట్లతో రాణించాడు.
ఫించ్, స్మిత్ శతకాలు.. ఆసీస్ భారీ స్కోర్
అంతముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాటింగ్ పిచ్‌పై కంగారూ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్( 69 ;76 బంతుల్లో 6 పోర్లు) లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు ఈ జోడి 156 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా వార్నర్ సాగుతుండగా.. అద్భుత బంతితో షమీ.. వార్నర్‌ను ఔట్ చేశాడు. అప్పటికే కుదిరుకున్న ఫించ్‌కు స్టీవ్ స్మిత్( 105; 66 బంతుల్లో 11 పోర్లు, 4 సిక్సర్లు) జతకలిశాడు. వీరిద్దరు పోటీపడి మరీ పరుగులు రాబట్టారు. శతకం సాధించి మంచి ఊపుమీదున్న ఫించ్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 108 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఐపీఎల్‌లో అద్భతంగా ఆడిన స్టొయినిస్‌ను చాహల్ తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు. దీంతో వెంట వెంటనే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు పుంజుకుంటారని బావించగా.. అభిమానుల ఆశలపై మాక్స్‌వెల్ నీళ్లు చల్లాడు. వచ్చి రావడంతోనే బౌండరీలతో విరుచుపడ్డాడు. 19 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సర్లు సాయంతో 45 పరుగులు చేశాడు. చివర్లో బారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, చాహల్, సైనీ తలా ఒక వికెట్ పడగొట్టారు. భారత్ విజయం సాధించాలంటే.. 375 పరుగులు చేయాలి.