మొన్న పాక్‌.. నేడు శ్రీలంక‌.. భార‌త్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు.. ఇక ఇంటికే..!

India Lose To Sri Lanka By 6 Wickets.ఆసియా క‌ప్ ని రిహార్స‌ల్స్‌గా ఉప‌యోగించుకోవాల‌నుకున్న టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sept 2022 8:52 AM IST
మొన్న పాక్‌.. నేడు శ్రీలంక‌.. భార‌త్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు.. ఇక ఇంటికే..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆసియా క‌ప్ టోర్నీని రిహార్స‌ల్స్‌గా ఉప‌యోగించుకోవాల‌నుకున్న టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. లీగ్ ద‌శ‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూప‌ర్‌-4కు అర్హ‌త సాధించిన భార‌త్‌.. ఆ త‌రువాత వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైన‌ల్ చేరే చాన్స్‌ను దాదాపుగా కోల్పోయింది. అయితే.. ఆఫ్గాన్‌తో చివ‌రి మ్యాచ్ ఆడాల్సి ఉన్న నేప‌థ్యంలో సాంకేతికంగా మాత్రం పైన‌ల్ రేసులో ఉంది. ఇక భార‌త్ ఫైన‌ల్ చేరాలంటే చాలా అద్భుత‌మే జ‌ర‌గాలి. అఫ్గాన్ జ‌ట్టుపై భార‌త్ విజ‌యం సాధించ‌డంతో పాటు పాక్ జ‌ట్టు ఆఫ్గాన్‌, శ్రీలంక చేతిలో ఓడిపోవాలి.

ఫైనల్‌ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతితో ఓట‌మిపాలైంది. ముందుగా టాస్‌ ఓడి తొలుత‌ బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ (72; 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా సూర్యకుమార్‌ యాదవ్‌ (34) ఫర్వాలేదనిపించాడు. వ‌రుస‌గా రెండు అర్థ‌శ‌కాల‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో డ‌కౌట్‌గా వెనుదిర‌గ‌గా.. మూడో మ్యాచ్‌లోనూ రాహుల్(6) నిరాశ‌ప‌రిచాడు.

హార్దిక్‌ పాండ్యా (17), రిషబ్‌ పంత్‌ (17) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. దీప‌క్ హుడా(3) అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. చివ‌ర్లో అశ్విన్‌ (15 నాటౌట్‌; 7 బంతుల్లో ఒక సిక్సర్‌) ఓ చేయి వేయ‌డంతో భార‌త్ పోరాడ‌గ‌లిగే స్కోరును సాధించింది. లంక బౌలర్లలో మధుషనక మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చమిక, దసున్‌ షనక చెరో 2 వికెట్లు తీశారు.

ఓపెనర్లు పతుమ్‌ నిసాంక (52; 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుషాల్‌ మెండిస్‌ (57; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆక‌ట్టుకోగా.. కెప్టెన్‌ దసున్‌ షనక (33 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), భానుక రాజపక్స (25 నాటౌట్‌; 17 బంతుల్లో 2 సిక్సర్లు) రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ మూడు వికెట్లు తీశాడు. దసున్‌ షనకకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఇక భార‌త్ త‌న చివ‌రి మ్యాచ్‌ను గురువారం ఆఫ్గాన్‌తో ఆడ‌నుంది.

Next Story