ఫైనల్ చేరిన భారత్
By - Medi Samrat |
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ 105 పరుగులతో పోరాడినప్పటికీ ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ వేయడంతో భారత్ కు విజయం వరించింది.
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), కెప్టెన్ బట్లర్ (25), హ్యారీ బ్రూక్ (7) త్వరగానే పెవిలియన్ చేరారు. జాకబ్ బెతెల్ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి ఇంగ్లండ్ కు అవకాశాన్ని ఇచ్చాడు. అతనికి విల్ జాక్స్ (35) చక్కటి సహకారం అందించాడు. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది.