పారాలింపిక్స్ ముగింపు వేడుకలు.. సత్తా చాటిన భారత క్రీడాకారులు

India finishes 24th with record 19 medals, including 5 gold. టోక్యోలో పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. 12 రోజుల పాటు

By అంజి  Published on  6 Sept 2021 7:29 AM IST
పారాలింపిక్స్ ముగింపు వేడుకలు.. సత్తా చాటిన భారత క్రీడాకారులు

భారత్ ఖాతాలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు

మొత్తం 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచిన భారత్

12 రోజుల పాటు సాగిన పారాలింపిక్స్

జపాన్: టోక్యోలో పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. 12 రోజుల పాటు సాగిన పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ ఏకంగా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో పారాలింపిక్స్ భారత క్రీడాకారులు అదరగొట్టారు. ఇక ముగింపు వేడుకలు సైతం ఘనంగా జరిగాయి. లేజర్ లైటింగ్, బాణసంచా, రంగురంగుల లైట్లతో ముగింపు వేడుకలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో భారత బృందానికి షూటర్ అవని లేఖారా ప్రాతినిధ్యం వహించారు. భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అవని లేఖారా.

ముగింపు కార్యక్రమంలో టోక్యో ఆర్గనైజేషన్ కమిటీ చీఫ్ అండ్రూ పర్సన్స్ మాట్లాడారు. ఈ సారి ఎన్నడూలేనంతగా 86 దేశాలు పారాలింపిక్స్‌లో పాల్గొన్నాయని చెప్పారు. భారత పారాలింపిక్స్ బృందాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా అభినందనలు తెలిపారు. దేశ క్రీడా చరిత్రలో టోక్యో ఒలింపిక్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేశారని, వారందరికీ మనం మద్దతు ఇవ్వాలనిప ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పారాలింపిక్స్‌లో భారత్‌కు 19 పతకాలు రావడం ఇదే మొదటిసారి. దీంతో భారత్‌కు ఇప్పటి వరకు పారాలింపిక్స్‌లో వచ్చిన పతకాలు సంఖ్య 31కి చేరింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ పటేల్ రజత పతకం సాధించి మొదటి బోణీ కొట్టగా.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కృష్ణ నాగర్‌ బంగారు పతకం సాధించి పారాలింపిక్స్‌లో భారత పోరును ముగించాడు. 2016లో రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు కేవలం 4 పతకాలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు జరిగిన పారాలింపిక్స్‌లో ఒక పతకం మాత్రమే వచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో మొత్తం 54 మంది పారా అథ్లెట్లు 9 వేర్వేరు విభాగాల్లో పోటీపడ్డారు. ఇక చైనా దేశం 207 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, రష్యాలు ఉన్నాయి.


Next Story