టీ20 సిరీస్‌లోనూ తగ్గని భారత జోరు.. మెరిసిన రోహిత్, కార్తీక్.. విండీస్ చిత్తు
India defeat West Indies by 68 runs take 1-0 lead in series.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియా తమ జోరును
By తోట వంశీ కుమార్ Published on 30 July 2022 3:10 AM GMTపరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ఇండియా తమ జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమ్ఇండియా టీ20 సిరీస్‌లోనూ ఘనంగా బోణీ చేసింది. శుక్రవారం కరేబియన్లతో జరిగిన తొలి టీ20లో 68 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (64; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో కదం తొక్కగా చివర్లో ఆఖర్లో దినేశ్ కార్తీక్ (41 నాటౌట్; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ అవతారమెత్తిన సూర్యకుమార్ (24; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (0), రిషబ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16) విఫలం అయ్యారు. ఆఖర్లో అశ్విన్(13 నాటౌట్) అండతో దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడడంతో భారత్ భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది.
భారీ లక్ష్యమే అయినప్పటికీ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్న వెస్టిండీస్ కు అది సరిపోతుందా అనుకుంటే అతిథ్య జట్టు మరీ దారుణంగా ఆడింది. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలిగ్ చేయడంతో విండీస్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 20 పరుగులు చేసిన బ్రూక్స్ ఆ జట్టులో టాప్ స్కోరర్ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. బ్రూక్స్ 20, మేయేర్స్ 15, హోల్డర్ 0, కెప్టెన్ పూరన్ 18, పావెల్ 14, హెట్‌మైర్ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అశ్విన్, అర్శ్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా జడేజా ఓ వికెట్ తీశాడు.