ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 సెమీ-ఫైనల్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మహిళల జట్టును ఓడించింది. ఈ విజయంతో భారత యువ జట్టు టోర్నీ ఫైనల్స్‌కు చేరుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళల అండర్-19 జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అనంతరం భారత మహిళల అండర్-19 జట్టు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు వేగంగా ఆరంభం లభించింది. డేవినా సారా టి పెర్రిన్, జెమీమా స్పెన్స్ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. దీని తర్వాత డేవినా సారా టి పెర్రిన్, కెప్టెన్ అబి నార్గ్రోవ్ మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సారా 12వ ఓవర్లో పెవిలియన్‌కు చేరింది. 40 బంతుల్లో 45 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత వికెట్ల వర్షం కురిసింది. కెప్టెన్ అబి నార్గ్రోవ్ 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు. కేటీ జోన్స్ డకౌట్‌తో పెవిలియన్‌కు చేరుకుంది. షార్లెట్ స్టబ్స్ 12 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసింది. ప్రిషా థానవాలా 2 పరుగులు చేసింది. అము సురేన్‌కుమార్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, టిల్లీ కోర్టీన్-కోల్మన్ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా రెండు వికెట్లు, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కమిలిని(56), సనికా(11) పరుగులతో అజేయంగా నిలవగా.. గొంగడి త్రిష(35) పరుగులు చేసి పెవిలియన్ చేరింది.