భారత్‌కు క్రికెట్ ముఖ్యం.. నేను కాదు.. ఓట‌మి త‌ర్వాత గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.

By -  Medi Samrat
Published on : 26 Nov 2025 3:09 PM IST

భారత్‌కు క్రికెట్ ముఖ్యం.. నేను కాదు.. ఓట‌మి త‌ర్వాత గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు. రెండో, చివరి టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

భారత్ ఓటమి తర్వాత కోచ్ గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అతడు స్వదేశంలో టెస్టుల్లో వరుసగా రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కొన్న మొదటి భారత కోచ్‌గా నిలిచాడు. గంభీర్ కోచింగ్‌లో గ‌త‌ సంవత్సరం న్యూజిలాండ్‌తో భారత్ 0-3తో సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో 0-2 తేడాతో ఓడిపోయింది. ఈ క్ర‌మంలోనే గంభీర్ విలేకరుల సమావేశంలో త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై మౌనం వీడాడు. త‌న‌ భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని చెప్పాడు.

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో త 7 హోమ్ టెస్ట్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. అలాగే ఇప్పటివరకు ఆడిన 18 మ్యాచ్‌లలో 10 లో జట్టు ఓటమిని ఎదుర్కొంది. గౌహతి టెస్ట్ మ్యాచ్‌లో 408 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశానికి రాగా.. మీరు జట్టుకు స‌రైన ఎంపిక కాదా అని ప్రశ్న అడిగారు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని గంభీర్ బదులిచ్చాడు. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా.. భారత్‌కు క్రికెట్ ముఖ్యం, నేను కాదు. ఈ రోజు కూడా నేను అదే విషయానికి కట్టుబడి ఉన్నానన్నాడు.

గంభీర్ విమర్శలపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మీరు ఓటములపై ​​మాత్రమే దృష్టి పెడుతున్నారని, విజయాలను విస్మరించారని మీడియాపై విరుచుకుపడ్డాడు.

ఇంగ్లండ్‌లో యూత్ టీమ్‌తో ఫలితాలు రాబట్టింది నేనే అనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారని అన్నాడు. మీరు ప్రతిదీ త్వరగా మర్చిపోతారు. న్యూజిలాండ్ గురించి ప్రస్తావిద్దాం, కానీ నా కోచింగ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను గెలుచుకున్న విషయం మర్చిపోవద్దు. ఈ టీమ్ కొత్తది, అనుభవం తక్కువ, నేను ముందే చెప్పినట్లు నేర్చుకోడానికి టైం పడుతుంది, కానీ వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేను పరివర్తన అనే పదాన్ని ద్వేషిస్తున్నాను. సాకులు చెప్పడానికి నేను ఇక్కడకు రాలేదని, యువ ఆటగాళ్ళు నేర్చుకుంటున్నారు. మీరు వారికి సమయం ఇవ్వాలి. ఓటమి బాధ్యత అందరిదీ, ముందుగా నాది అని పేర్కొన్నాడు. 95/1 నుంచి 122/7కి వెళ్లడం సరికాదన్నారు. ఓటమికి ఏ ఒక్క ఆటగాడు లేదా వారు ఆడిన‌ షాట్ కార‌ణం కాదు. నేను ఎవరినీ విడివిడిగా నిందించలేను. భవిష్యత్తులో కూడా ఎవరినీ నిందించను అని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత గంభీర్ జట్టును ఎన్నుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అతను ఆల్ రౌండర్లపై ఎక్కువ నమ్మకం ఉంచాడు. అయితే ఆయన తన అభిప్రాయాలను సమర్థించుకున్నారు. టెస్టు క్రికెట్‌కు తెలివైన లేదా ప్రతిభావంతులైన ఆటగాళ్ల అవసరం లేదని గంభీర్ అన్నాడు. మాకు దృఢ సంకల్పం ఉన్న ఆటగాళ్లు కావాలి, వారే మంచి టెస్టు ఆటగాళ్లు అవుతార‌ని పేర్కొన్నాడు.

Next Story