మూడో రోజే ముగిసిన ఐదో టెస్టు.. 4-1తో సిరీస్ భార‌త్ వ‌శం

ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

By Medi Samrat  Published on  9 March 2024 9:38 AM
మూడో రోజే ముగిసిన ఐదో టెస్టు.. 4-1తో సిరీస్ భార‌త్ వ‌శం

ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ జ‌ట్టులో జో రూట్ అత్యధికంగా 84 పరుగులు చేశాడు. అశ్విన్ ఐదు వికెట్లు తీయ‌గా.. కుల్దీప్, బుమ్రా త‌లా రెండేసీ వికెట్లు తీశారు.

మూడో రోజు భారత్ 473/8 స్కోరు వ‌ద్ద‌ ఆట ప్రారంభించింది. నిన్న‌టి స్కోరుకు భారత్ నాలుగు పరుగులు మాత్రమే జోడించాక ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో షోయబ్ బషీర్ ఐదు వికెట్లు తీయగా, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ త‌లా రెండేసీ వికెట్లు తీశారు. దీంతో భారత్ 259 పరుగుల ఆధిక్యం సాధించింది.

దీనికి సమాధానంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించ‌గా.. 100లోపే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. జాక్ క్రాలీ (0), బెన్ డకెట్ (2), ఆలీ పోప్ (19), జానీ బెయిర్‌స్టో (39), కెప్టెన్ బెన్ స్టోక్స్ (2) తొందరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే జో రూట్ మాత్రం ఒక ఎండ్‌లో నిల‌దొక్కుకునే ప్ర‌యత్నం చేశాడు. జాగ్రత్తగా ఆడుతున్న జో రూట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. అవతలి ఎండ్ లో వికెట్లు ప‌డుతూనే ఉన్నాయి. బెన్ ఫాక్స్ (8), టామ్ హార్ట్లీ (20), మార్క్ వుడ్ (0), బషీర్ (13) అంతా ఔటయ్యారు. భారత్‌ తరఫున ఆర్‌ అశ్విన్‌ 5 వికెట్లు తీయగా, కుల్దీప్‌, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు.

Next Story