అసలు గంభీర్‌కి ఎలాంటి జట్టు కావాలి.? న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు కోచ్ అన్ని చెప్పేశాడు..!
న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌కు ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి జట్టును నిర్మించాలనుకుంటున్నాడో చెప్పాడు
By Medi Samrat Published on 14 Oct 2024 3:00 PM GMTన్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌కు ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి జట్టును నిర్మించాలనుకుంటున్నాడో చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో టీమిండియా తలపడనుంది. అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు గౌతమ్ గంభీర్ సమాధానాలు ఇచ్చాడు.
గంభీర్ మాట్లాడుతూ.. అవసరమైతే టెస్టు మ్యాచ్‌ను కాపాడేందుకు రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం భారత బ్యాట్స్‌మెన్‌కు ఉందని అన్నాడు. భారత జట్టును చూసి గర్విస్తున్నానని.. ఈ జట్టు మొత్తం లైనప్‌లో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని గంభీర్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో భారత జట్టు టీ20 శైలిలో బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా 2 రోజుల పాటు మ్యాచ్ జరగలేదు, అయనా ఫలితం వెలువడింది. కాన్పూర్ టెస్టులో భారత జట్టు బాల్, బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేసిందని పేర్కొన్నాడు.
ఒక రోజులో 400 పరుగులు చేయగలిగిన జట్టుగా మారాలని.. అలాగే రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి టెస్ట్ మ్యాచ్‌ను కాపాడుకోవాలని గంభీర్ అన్నాడు. ఇది నిజంగా టెస్ట్ క్రికెట్. ఈ రెండింటినీ చేయగలిగిన బ్యాట్స్‌మెన్‌లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. మొదటి లక్ష్యం ఎల్లప్పుడూ గెలవడమే.. మనం డ్రా కోసం ఆడాల్సిన పరిస్థితి ఏర్పడితే.. అది మా రెండవ, మూడవ ఎంపిక మాత్రమే. ఒక రోజులో 400-500 పరుగులు చేయగల ఆటగాళ్లను మనం ఎందుకు ఆపాలి అని గంభీర్ అన్నాడు. టీ20 క్రికెట్‌లో మేము హై రిస్క్ గేమ్ ఆడతామని.. ఎక్కువ రివార్డు పొందుతామని నేను ఎప్పుడూ చెబుతుంటాను. మనం 100 పరుగులకే ఆలౌట్ అయ్యే రోజులు కూడా వస్తాయి, కానీ మేము ఆటను ఆ విధంగా ఆడాలనుకోము.. వినోదాన్ని అందించాలనుకుంటామని పేర్కొన్నాడు.