మూడో వన్డేలో టీమిండియా ఘ‌న‌విజ‌యం.. సిరీస్ మనదే..

India Clinch ODI Series Against South Africa. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వ‌న్డేలో భార‌త జ‌ట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ విజయాన్ని

By Medi Samrat  Published on  11 Oct 2022 3:30 PM GMT
మూడో వన్డేలో టీమిండియా ఘ‌న‌విజ‌యం.. సిరీస్ మనదే..

మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వ‌న్డేలో భార‌త జ‌ట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ విజయాన్ని సాదించింది. మొద‌ట‌ స్పిన్ త్రయం వాషింగ్టన్ సుందర్ (2/15), షాబాజ్ అహ్మద్ (2/32), కుల్దీప్ యాదవ్ (4/18) దక్షిణాఫ్రికాను 99 పరుగులకు కట్టడి చేశారు. భారత్‌పై దక్షిణాఫ్రికాకు వ‌న్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు కావ‌డం విశేషం. అనంత‌రం శుభ్‌మన్ గిల్ (49) నేతృత్వంలోని టీమిండియా 19.1 ఓవర్లలో 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా వచ్చే ఏడాది జరుగ‌నున్న‌ వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. పేసర్ మహ్మద్ సిరాజ్ (2/17) కూడా బంతితో రాణించాడు. ఈ మ్యాచ్‌లో రాణించి T20 ప్రపంచ కప్ జట్టుకు తనను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొవాల్సింది సెల‌క్ట‌ర్ల‌కు బలమైన సందేశాన్ని పంపాడు. మ్యాచ్‌లో వాషింగ్టన్‌, షాబాజ్‌లకు మొద‌ట‌ వికెట్లు దక్కాయి. హ్యాట్రిక్‌ను కోల్పోయిన ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ త‌ర్వాత పుంజుకున్నాడు.

స్వల్ప స్కోరును ఛేద‌నకు దిగిన భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల‌లో ఓపెనర్ గిల్(49) తొలి బంతి నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లపై దాడి చేయగా.. శిఖర్ ధవన్ (8), ఇషాన్ కిషన్ (10) ఇద్దరూ విఫలమయ్యారు. ధవన్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవగా.. బంతిని అంచనా వేయలేక ఇషాన్ పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో గిల్‌కు జతకలిసిన శ్రేయాస్ అయ్యర్ (28 నాటౌట్) మంచి సహకారం అందించాడు. అయితే 18వ ఓవర్లో ఎన్గిడీ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన గిల్.. హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో సంజూ శాంసన్ (2 నాటౌట్)తో కలిసి శ్రేయాస్ లాంఛనం పూర్తి చేశాడు. 20వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత జట్టు 19.1 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు సాధించింది.


Next Story