కోహ్లీ విఫ‌లం.. ఆదుకున్న జ‌డేజా.. సిరీస్ మ‌న‌దే

India bundle out England for 121 runs clinch series 2-0.క‌ఠిన స‌వాలు త‌ప్ప‌ద‌నుకున్న‌టి20 సిరీస్‌ను టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2022 8:01 AM IST
కోహ్లీ విఫ‌లం.. ఆదుకున్న జ‌డేజా.. సిరీస్ మ‌న‌దే

క‌ఠిన స‌వాలు త‌ప్ప‌ద‌నుకున్న‌టి20 సిరీస్‌ను టీమ్ఇండియా ఏక ప‌క్షం చేసేసింది. హార్డ్‌హిట్ట‌ర్ల‌తో నిండిన ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త్ ధాటికి నిల‌వ‌లేక‌పోయింది. తొలి టి20లో 50 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లోనూ 49 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఫ‌లితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలిఉండ‌గానే 2-0తో చేజిక్కించుకుంది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన విలువ చాటుకోగా, విరాట్‌ కోహ్లీ త‌న వైఫల్యాన్ని కొనసాగించాడు. నేడు నాటింగ్‌హామ్‌లో నామమాత్రమైన మూడో మ్యాచ్‌ జరుగనుంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా ( 46 నాటౌట్‌; 29 బంతుల్లో 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడ‌గా, ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ రోహిత్‌ శర్మ (31; 20బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (26; 15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 4, అరంగేట్ర పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్ప‌కూలింది. మోయిన్‌ అలీ (35; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ విల్లే (33 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్ర‌మే ఓ మోస్తారుగా పోరాడారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు, బుమ్రా, చాహల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆరంభంలోనే ఇంగ్లాండ్ ను గ‌ట్టి దెబ్బ‌తీసిన పేస‌ర్ భువనేశ్వర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది.

కోహ్లీ మళ్లీ విఫలం.. ఆదుకున్న జ‌డేజా

ఇషాన్ కిష‌న్ పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ అత‌డి స్థానంలో పంత్‌ను ఓపెన‌ర్‌గా పంపింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి మెరుపు ఆరంభాన్ని అందివ్వగ్గా అత‌డికి తోడుగా వ‌చ్చిన పంత్ కూడా చెల‌రేగి పోవ‌డంతో భార‌త్ 4 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 43 ప‌రుగులు చేసింది. అరంగ్రేట బౌల‌ర్ గ్లీస‌న్ త‌న తొలి ఓవ‌ర్‌లోనే రోహిత్‌, త‌రువాతి ఓవ‌ర్ల‌లో వ‌రుస బంతుల్లో కోహ్లి(1), పంత్‌ల‌ను పెవిలియ‌న్ చేర్చాడు. విరాట్ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించాడు. దీంతో భార‌త్ 61/3 క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో సూర్య‌కుమార్‌(15), హార్ధిక్ పాండ్య‌(12) లు ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. జోర్డాన్ వ‌రుస బంతుల్లో వీరిద్ద‌రిని పెవిలియ‌న్ చేర్చ‌డంతో భార‌త్ 89/5 తో మ‌రింత ఇబ్బందుల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో స్కోర్ 130 అయినా దాటుతుందా అనే సందేహం క‌లిగింది. అయితే.. దినేశ్ కార్తిక్‌(12)తో జ‌త క‌లిసిన జ‌డేజా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. దినేశ్ కార్తిక్ ఔటైనా హ‌ర్ష‌ల్ ప‌టేల్‌(13) అండ‌తో భార‌త్‌కు మంచి స్కోర్ అందించాడు.

Next Story