చెలరేగినా సూర్యకుమార్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
India Beat West Indies By 7 Wickets To Take Series Lead 2-1.వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్ అవతారం ఎత్తిన
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2022 7:42 AM ISTవెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో మూడో టీ20లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.
ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (73; 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగగా, బ్రాండన్ కింగ్ (20; 20 బంతుల్లో 3 ఫోర్లు) కెప్టెన్ పూరన్ (22; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రోవ్‌మన్ పావెల్ (23; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), హెట్‌మైర్ (20; 12 బంతుల్లో 2 సిక్సర్లు) రాణించడంతో విండీస్ పోరాడే లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందు ఉంచగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కుమార్ రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్‌సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేదనలో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(11) నడుం కండరాలు పట్టేయడంతో రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికి మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (76; 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) విండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. మరో ఎండ్‌లో అతడికి శ్రేయాస్ అయ్యర్ (24) సహకారం అందించాడు. సూర్య కుమార్ యాదవ్ పెవిలియన్ చేరే సమయానికి భారత్ స్కోర్ 135/2. అప్పటికే భారత విజయం ఖారైపోయింది. హార్దిక్ పాండ్య(4) ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోయినా.. దీపక్ హుడా(10 నాటౌట్) తో కలిసి రిషబ్ పంత్(33 నాటౌట్; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మిగతా పనిని పూర్తి చేశాడు.
రెండో టి20 మూడు గంటలు ఆలస్యమవడంతో మరుసటి రోజే జరిగిన ఈ మ్యాచ్‌ను గంటన్నర లేట్‌గా ప్రారంభించారు. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టి20 శనివారం జరగనుంది.