బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2022 టోర్నీలో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 74 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కప్‌ను నెగ్గేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 42, హర్మన్‌ప్రీత్ కౌర్ 36, రోడ్రిగ్స్ 27 పరుగులు చేశారు. థాయ్‌లాండ్ బౌలర్లలో సోర్నరిన్ టిప్పోచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫన్నిటా మాయ, తిప్పట్చ పుత్తువాంగ్, నట్టాయ బూచతమ్‌కు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది. ఏ దశలోనూ థాయ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. భారత బౌలర్ దీప్తి శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. భారత బౌలర్లలో దీపిశర్మ మూడు వికెట్లు తీయగా రాజేశ్వరీ గైక్వాడ్ రెండు, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, షఫాలీ వర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు. షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.