హాంకాంగ్ పై సూర్య ప్ర‌తాపం.. సూప‌ర్-4కు దూసుకువెళ్లిన భార‌త్‌

India Beat Hong Kong by 40 Runs to Qualify For Super Four.ఆసియా క‌ప్ 2022 టోర్నీలో భార‌త్ దూసుకుపోతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2022 11:06 AM IST
హాంకాంగ్ పై సూర్య ప్ర‌తాపం.. సూప‌ర్-4కు దూసుకువెళ్లిన భార‌త్‌

ఆసియా క‌ప్ 2022 టోర్నీలో భార‌త్ దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ పై గెలిచి జోరు మీదున్న టీమ్ఇండియా బుధ‌వారం ప‌సికూన హాంకాంగ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 40 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో టీమ్ఇండియా సూప‌ర్‌-4కి దూసుకువెళ్లింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. మిస్ట‌ర్ 360 డిగ్రీస్‌గా పేరుగాంచిన సూర్య‌కుమార్ యాద‌వ్ ( 68 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌గా.. మాజీ కెప్టెన్ కోహ్లీ (59 నాటౌట్‌; 44 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లు) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని చేదించేందుకు బ‌రిలోకి దిగిన హంకాంగ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టులో బాబ‌ర్ హ‌య‌త్ (41) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువనేశ్వర్‌, అర్షదీప్‌, జడేజా, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

పాక్‌తో మ్యాచ్‌లో విఫ‌లమైన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ( 21; 13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), కేఎల్ రాహుల్ (36; 39 బంతుల్లో 2 సిక్సర్లు) లు ఈ సారి మాత్రం ఆవేశ‌ప‌డ‌కుండా నిదానంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. తొలి రెండు ఓవ‌ర్లు ఆచితూచి ఆడిన ఈ జంట మూడో ఓవ‌ర్‌లో హాంకాంగ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఈ ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు వ‌చ్చాయి. జోరును పెంచే క్ర‌మంలో రోహిత్ ఔట్ కాగా.. వ‌న్‌డౌన్లో వచ్చిన కోహ్లీతో క‌లిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఓ వైపు కోహ్లీ త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్ట‌గా.. ఎక్కువ సేపు క్రీజులో నిలిచే ల‌క్ష్యంతోనే రాహుల్ బ్యాటింగ్ చేశాడు.

13వ ఓవ‌ర్ చివ‌రి బంతికి రాహుల్ ఔట్ కాగా.. సూర్య‌కుమార్ వ‌చ్చి రావ‌డంతోనే దంచుకుడు మొద‌లు పెట్టాడు. బౌండ‌రీల‌తో అభిమానుల‌ను హోరెత్తించాడు. త‌న‌దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో అల‌రించాడు. తొలుత కోహ్లీ, ఆ త‌రువాత సూర్య ఇద్ద‌రూ అర్థ‌శ‌త‌కాల‌ను అందుకున్నారు. వీరిద్ద‌రు బాదుడుతో చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో భార‌త్ 78 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు.

Next Story